Wednesday, June 24, 2026

Buy now

బాధితుల పట్ల మానవత్వంతో స్పందించాలి : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

పెద్దపల్లి : మహిళలు,పిల్లలపై హింస,వేధింపులు, దుర్వినియోగానికి గురైన బాధితులకు సమగ్ర రక్షణ, సహాయం, పునరావాసం,న్యాయ సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు తెలంగాణ రాష్ట్ర మహిళా భద్రత విభాగం (డబ్ల్యూఎస్‌డబ్ల్యూఎస్)–భరోసా పీఎంయూ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధ్యక్షతన రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో వైద్య,ఆరోగ్య శాఖ, మహిళా,శిశు సంక్షేమ శాఖ,జిల్లా న్యాయ సేవల సంస్థలు, బాలల సంరక్షణ విభాగాలు,చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, కౌన్సిలర్లు, ఇతర భాగస్వామ్య శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ,భరోసా కేంద్రాల ద్వారా బాధిత మహిళలు, చిన్నారులకు అందిస్తున్న సేవలను మరింత ప్రభావవంతంగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల మధ్య సమన్వయం అత్యంత అవసరమని తెలిపారు. బాధితులకు తక్షణ సహాయం అందించడంతో పాటు, వారికి అవసరమైన కౌన్సెలింగ్,వైద్య సేవలు,న్యాయ సహాయం, పునరావాసం,సంక్షేమ సేవలను ఒకే వేదికపై సమర్థవంతంగా అందించడంలో భరోసా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.ప్రతి బాధితుడితో సానుభూతితో, మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.కేవలం చట్టపరమైన అంశాలకే పరిమితం కాకుండా, బాధితులకు భరోసా కల్పించే విధంగా స్పందించాలని అన్నారు.

బాధితుల సమస్యలను అర్థం చేసుకుని తక్షణ స్పందన అందించడం అత్యంత అవసరమని, ఆలస్యం లేదా నిర్లక్ష్యం కారణంగా ‘గోల్డెన్ అవర్’ కోల్పోయే ప్రమాదం ఉంటుందని తెలిపారు.కొన్ని సందర్భాల్లో బాధితులకు కుటుంబ సభ్యుల సహకారం లభించకపోవచ్చని, అలాంటి పరిస్థితుల్లో కూడా చట్టపరంగా, మానవతా దృక్పథంతో పాటు మానసిక పరంగా వారికి అవసరమైన సహాయాన్ని అందించాలని సూచించారు.

బాధితుల పరిస్థితిని అర్థం చేసుకుని, అవసరమైతే సంబంధిత ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో పై అధికారులను, అవసరమైతే పోలీస్ కమిషనర్‌ను కూడా నేరుగా సంప్రదించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఎదురైతే ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో ముందుకు సాగాలని తెలిపారు.

బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసుల నమోదు విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం లేదా అలసత్వం ప్రదర్శించరాదని, ముందుగా కేసు నమోదు చేసి అనంతరం దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

బాధితుల కోసం అమలులో ఉన్న రిఫరల్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం,కేసుల దర్యాప్తును వేగవంతం చేయడం, బాధితులకు నాణ్యమైన కౌన్సెలింగ్ సేవలు అందించడం, బాలల రక్షణకు సంబంధించిన చర్యలను పటిష్టపరచడం,వివిధ శాఖల మధ్య సమాచార మార్పిడి, పరస్పర సహకారాన్ని మెరుగుపరచడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి సమీక్ష నిర్వహించారు.

మహిళలు,పిల్లలకు అవసరమైన రక్షణ, సహాయం, పునరావాస సేవలు మరింత సమర్థవంతంగా అందేలా సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. బాధితుల సంక్షేమం, భద్రతను కేంద్రంగా తీసుకుని అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

సమావేశంలో పాల్గొన్న అధికారులు తమ శాఖల ద్వారా అందిస్తున్న సేవలు, ఎదురవుతున్న సమస్యలు,వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రమేష్‌బాబు, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ,షీ టీమ్ ఎస్‌ఐలు హైమా, ఉషారాణి,శైలజ, పోక్సో కేసుల ప్రత్యేక ప్రజాప్రతినిధి న్యాయవాది రాంభావు,అదనపు డీఆర్‌డీఓ (పెద్దపల్లి) రవీందర్,ఎన్‌జీఓ ప్రతినిధి శారద, సమగ్ర బాలల పరిరక్షణ సేవలు (ఐసీపీఎస్) జిల్లా ప్రతినిధి సత్తయ్య, చైల్డ్ హెల్ప్‌లైన్ ప్రతినిధి ప్రేమ్‌కుమార్, జిల్లా న్యాయ సేవల సంస్థ (డీఎల్‌ఎస్‌ఏ) ప్రతినిధి ఎం.డి. సమ్ధాని,మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ప్రతినిధి జితేందర్,భరోసా కేంద్ర సభ్యులు,స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular