కామారెడ్డి: కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నిరంతర పర్యవేక్షణ తో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలులో కామారెడ్డి జిల్లా రాష్ట్ర స్థాయిలో విశిష్ట ప్రగతిని నమోదు చేసుకుంది.పేదలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లా పలు విభాగాల్లో అగ్రస్థానాల్లో నిలిచింది అన్నారు.
జిల్లాలో మొత్తం 12,090 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయగా, మంజూరులో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో 4వ స్థానం సాధించింది. అలాగే 10,945 ఇళ్లకు గ్రౌండింగ్ పూర్తి చేసి 90.52 శాతం ప్రగతితో రాష్ట్రంలో 2వ స్థానం పొందింది అన్నారు.
గ్రౌండింగ్ పూర్తయిన ఇళ్లలో 6,077 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా, పూర్తయిన ఇళ్ల నిర్మాణాల విభాగంలో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానం దక్కించుకుంది అన్నారు.
నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు జిల్లా యంత్రాంగం నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తోంది.
ఇప్పటికే లబ్ధిదారులకు రూ.238.77 కోట్లు విడుదల చేయగా, లబ్ధిదారులకు చెల్లింపుల పురోగతిలో కూడా కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో 8వ స్థానం సాధించింది అన్నారు.
అదేవిధంగా, గృహ నిర్మాణాలకు ఆర్థిక సహకారం అందించేందుకు 2,365 మంది లబ్ధిదారులకు రూ.31.97 కోట్లు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలుగా అందజేశారు. బ్యాంకుల సహకారంతో మరింత మంది లబ్ధిదారులకు రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల ఫేజ్–2 అమలుకు సంబంధించి కూడా జిల్లా యంత్రాంగం ముందస్తు సన్నాహాలు చేపట్టింది. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించాలనే ప్రభుత్వ లక్ష్య సాధనకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు .
జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను నిర్దేశిత గడువులో పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలులో కామారెడ్డి జిల్లా రాష్ట్రంలో ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు.

