సిరిసిల్ల: విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారిస్తూ “జీరో యాక్సిడెంట్” లక్ష్యాన్ని సాధించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్ రాజన్న సిరిసిల్ల సర్కిల్ ఆధ్వర్యంలో “వన్ మినిట్ రూల్” భద్రతా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ టి.వేణుమాధవ్ పోస్టర్లను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ ఇంజనీర్ అంజయ్య, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ రాజలింగు, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎస్‌ఈ టి. వేణుమాధవ్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి ఏ విద్యుత్ పనిని ప్రారంభించే ముందు ఒక్క నిమిషం సమయం కేటాయించి భద్రతా చర్యలను పరిశీలించడం ద్వారా ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని తెలిపారు.
పని అనుమతి, విద్యుత్ సరఫరా నిలిపివేత, ఎర్తింగ్, వ్యక్తిగత రక్షణ పరికరాల (పీపీఈ) వినియోగం, పనికి ఉపయోగించే పరికరాల స్థితి, పని ప్రదేశంలోని ప్రమాదాలపై పూర్తి అవగాహనతోనే విధులు నిర్వర్తించాలని సూచించారు. భద్రత అనేది కేవలం నిబంధన కాదని, ప్రతి ఉద్యోగి బాధ్యత అని పేర్కొన్న
ఆయన, “ఒక్క నిమిషం ఆలోచన… జీవితాంతం రక్షణ” అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, ఉద్యోగులు ప్రతి పనికి ముందు “వన్ మినిట్ రూల్”ను తప్పనిసరిగా పాటిస్తూ సురక్షితమైన పని సంస్కృతిని మరింత బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

