**ప్రజానవ బ్యూరో, హైదరాబాద్: తెలంగాణ విశాల ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్రానికి చెందిన అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులు కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్రం నుంచి నిధులు, అనుమతులు సాధించేందుకు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు.
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, ఈటల రాజేందర్, కుందూరు రఘువీర్ రెడ్డి, కడియం కావ్య, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురాం రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న హైదరాబాద్‌కు భారతీయ నిర్వహణ సంస్థ (ఐఐఎం) మంజూరు చేయించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని పేర్కొన్నారు. ఈ విషయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి ఐఐఎం మంజూరుకు విజ్ఞప్తి చేయాలని ఎంపీలను కోరారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 స్వాధీనం, మెట్రో ఫేజ్-2 విస్తరణకు సంబంధించి కేంద్రంతో జరుగుతున్న చర్చలను వివరించిన సీఎం, ఇందుకు కన్సల్టెంట్‌గా ఎస్‌బీఐ క్యాప్స్‌ను నియమించేందుకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి ప్రత్యేకంగా దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డిని కోరారు.
రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో 95 శాతం భూసేకరణ పూర్తైందని, పనులు ప్రారంభించేందుకు, దక్షిణ భాగం భూసేకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం అవసరమని చెప్పారు. అలాగే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశ టెండర్ల దశకు చేరుకుందని, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ఆమోదం త్వరగా లభించేలా కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను ఎంపీలు కలవాలని సూచించారు.
అంతర్‌రాష్ట్ర జలాల అంశంపై ఇటీవల జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ముఖ్యమంత్రులతో జరిగిన సమావేశ వివరాలను కూడా సీఎం వివరించారు. తుంగభద్ర జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా పూర్తిస్థాయిలో అందేలా డ్యామ్, కాలువల్లో పూడిక తొలగింపునకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఎంపీలు కృషి చేయాలని కోరారు.
గోదావరి-నాగార్జునసాగర్ అనుసంధానం, గోదావరి-కావేరి అనుసంధాన ప్రాజెక్టులు, ఛత్తీస్‌గఢ్‌తో జలాల వినియోగం, ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ నిరభ్యంతర పత్రాలు (ఎన్‌వోసీ) ఇవ్వాల్సిన అంశాలపై కూడా కేంద్రంతో సమన్వయం చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని సూచించారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో సమావేశమై పరిష్కారం సాధించాలని ఎంపీలకు తెలిపారు.
శంషాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబైలకు బుల్లెట్ రైలు మార్గాల అలైన్‌మెంట్లు దాదాపు ఖరారయ్యాయని, ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్‌పోర్టు, వరంగల్ ఎయిర్‌పోర్టులకు అవసరమైన భూసేకరణ పూర్తయిందని సీఎం వెల్లడించారు. ఈ విమానాశ్రయాల్లో ఎంఆర్వో, ఎయిర్ కార్గో కేంద్రాల ఏర్పాటు కోసం కూడా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి, అన్ని పార్టీల ఎంపీలకు అవసరమైన సమాచారం అందించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్‌ను సమన్వయ అధికారిగా నియమించినట్లు తెలిపారు. పెండింగ్ అంశాలకు సంబంధించిన వివరాల కోసం ఆయనను సంప్రదించాలని సూచించారు. అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవికి సీఎం సూచించారు.

