* అలంపూర్లో రూ. 376.25 కోట్ల విద్యుత్ పనులకు శ్రీకారం
* యుద్ధప్రాతిపదికన దేవాదుల పూర్తి: డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్
ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: రాష్ట్రంలో వ్యవసాయం, గృహ, పారిశ్రామిక రంగాల బలోపేతానికి, సాగునీటి రంగానికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో రూ.376.25 కోట్ల విలువైన విద్యుత్ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎర్రవల్లి వద్ద రూ.155 కోట్లతో 220/132/33 కేవీ, రాయపురం వద్ద రూ.48 కోట్లతో 132/33 కేవీ విద్యుత్ ఉపకేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో పాటు, పలు గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 33/11 కేవీ సబ్స్టేషన్లను ప్రారంభించారు. గోదావరి జలాలతో రైతులకు భరోసా.
మరోవైపు ములుగు జిల్లాలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం పరిశీలించారు. సమ్మక్క సారలమ్మ బ్యారేజీతో పాటు దేవాదుల పంపుహౌస్ పనులను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. దేవాదుల కింద 6.14 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించడమే లక్ష్యంగా 38.16 టీఎంసీల నీటిని సంపూర్ణంగా వినియోగించుకునేలా పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్ పేరుతో అవినీతికి పాల్పడిందని విమర్శిస్తూ, కాళేశ్వరం వైఫల్యాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని మంత్రులు స్పష్టం చేశారు.

