Wednesday, July 15, 2026

Buy now

ఇన్‌ సర్వీస్‌ టీచర్‌ ట్రైనింగ్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఇన్‌ సర్వీస్‌ టీచర్‌ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం సందర్శించి, ఉపాధ్యాయులతో కలిసి శిక్షణ తరగతిలో కూర్చుని పాఠాలను విన్నారు.

హిందీ ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణలో పాల్గొన్న కలెక్టర్, సాధారణంగా బోధించే ఉపాధ్యాయులు విద్యార్థుల స్థానంలో కూర్చుని పాఠాలు వినడం ద్వారా కలిగే అనుభవాలు, శిక్షణ విధానంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

జిల్లాలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు సిరిసిల్ల గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, ఇంగ్లీష్ ఉపాధ్యాయులకు వేములవాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, ప్రాథమిక స్థాయి ఎంఆర్‌పీలకు తెలుగు, ఇంగ్లీష్, గణిత అంశాలపై ఎల్లారెడ్డిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణ కొనసాగుతోందని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్‌ సర్వీస్‌ టీచర్‌ ట్రైనింగ్ ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాల మెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని రోజువారీ బోధనలో అమలు చేయాలని సూచించారు.

విద్యార్థి కేంద్రీకృత బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని, రంగుల వినియోగంతో పాటు కృత్యాధారిత బోధన చేపట్టాలని తెలిపారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పదాలు, అంకెలు, పండ్లు, నిత్యజీవితంలో ఉపయోగించే ఇతర అంశాలను సులభంగా నేర్చుకునేలా బోధించాలని సూచించారు. బోధనలో టీచింగ్ అండ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్ఎంలు) సమర్థంగా వినియోగించి విద్యార్థుల్లో పాఠశాలపై ఆసక్తి పెంపొందించాలని చెప్పారు.

ఇంగ్లీష్, గణితం తదితర అంశాల్లో విద్యార్థుల కనీస అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించే దిశగా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గదిలో అమలు చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి మొండయ్య, తహసీల్దార్ మహేష్, విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular