తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్‌గా సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్, సీనియర్ అధ్యాపకులు ఆచార్య భట్టు రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
తెలుగు భాష పరిరక్షణ, పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించే తెలంగాణ తెలుగు అకాడమీకి ఆచార్య భట్టు రమేష్‌ను డైరెక్టర్‌గా నియమించడంపై విద్యావేత్తలు, అధ్యాపకులు, పరిశోధకులు, గిరిజన సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
ఉన్నత విద్యా రంగంలో మూడు దశాబ్దాలకు పైగా బోధనా అనుభవం కలిగిన ఆచార్య భట్టు రమేష్, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రెండు పర్యాయాలు రిజిస్ట్రార్‌గా సేవలందించారు. జానపద గిరిజన విజ్ఞాన పీఠం పీఠాధిపతిగా, గిరిజన అధ్యయన శాఖాధిపతిగా, విశ్వవిద్యాలయ పాలక మండలి సభ్యుడిగా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.
గిరిజన సామాజిక నేపథ్యం నుంచి వచ్చిన ఆయన జానపద, గిరిజన సంస్కృతుల పరిరక్షణకు విశేష కృషి చేశారు. పలు మేజర్, మైనర్ పరిశోధన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పరిశోధనా పత్రాలు సమర్పించారు. జానపద, గిరిజన విజ్ఞానానికి సంబంధించిన 30కి పైగా పరిశోధన గ్రంథాలకు సంపాదకత్వం వహించగా, ఏడు పుస్తకాలను స్వయంగా రచించారు.
గిరిజన బాలల కోసం **‘బంజారా భారతి’**, **‘బంజారా గణితం’** వంటి పాఠ్యపుస్తకాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన ఆయన పర్యవేక్షణలో పలువురు పరిశోధకులు ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు పొందారు.
విద్యా రంగానికే పరిమితం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా పలు కమిటీల్లో సభ్యుడిగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో పీపుల్స్ వార్ గ్రూప్, జనశక్తి సంస్థలతో జరిగిన శాంతి చర్చల మానిటరింగ్ కమిటీలో సభ్యుడిగా, రాష్ట్ర స్థాయి మద్యపాన నిషేధ సలహా కమిటీ సభ్యుడిగా, గిరిజన భూ రక్షణ చట్టాల పర్యవేక్షణ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు.
వరంగల్ జిల్లాలో గుడుంబా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న 200కు పైగా గ్రామాల గిరిజన వితంతువుల పునరావాసానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం పనిచేసి పలు నివేదికలను సమర్పించారు.
ఆయన విద్యా సేవలను గుర్తిస్తూ తెలంగాణ ప్రభుత్వం 2014లో **రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు**తో సత్కరించగా, గిరిజన సాహిత్యం, జానపద కళల అభివృద్ధికి చేసిన కృషికి గాను 2017లో **డా. బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు** అందుకున్నారు.
నూతన డైరెక్టర్‌గా నియమితులైన సందర్భంగా ఆచార్య భట్టు రమేష్ మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ తెలుగు అకాడమీ ద్వారా తెలుగు భాష వికాసం, నాణ్యమైన పాఠ్యపుస్తకాల ప్రచురణ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.

