* సింగరేణి అధికారులతో బీపీసీఎల్ ఆధ్వర్యంలో పరిశుభ్రత, భద్రతపై ప్రతిజ్ఞ**
రామగుండం: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న “స్వచ్ఛతా పఖ్వాడా” కార్యక్రమంలో భాగంగా బుధవారం రామగుండం ఏరియా–1 పరిధిలోని గోదావరిఖని ఇల్లందు క్లబ్‌లో సింగరేణి అధికారులకు పరిశుభ్రత, పరిశుచితత్వం, కార్యస్థల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఇంజనీర్లు, డీజిల్ ఇన్‌చార్జీలు, స్టోర్ ఇన్‌చార్జీలు సహా పలువురు సింగరేణి అధికారులు పాల్గొని “స్వచ్ఛతా పఖ్వాడా ప్రతిజ్ఞ” చేశారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆర్జీ–1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, ఆర్జీ–2 జనరల్ మేనేజర్ బి. వెంకటయ్య, ఆర్జీ–3 జనరల్ మేనేజర్ ఎస్. మధుసూదన్, ఎస్‌హెచ్‌పీఎం శ్రీనివాస్, ఎన్. రాధాకృష్ణ (ఎంఎం) మాట్లాడుతూ బీపీసీఎల్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. పరిశుభ్రతను పాటించడం, సురక్షిత పని విధానాలను అనుసరించడం ఉద్యోగుల శ్రేయస్సుతో పాటు సంస్థ పనితీరును మెరుగుపరుస్తుందని తెలిపారు. పరిశుభ్రమైన, భద్రమైన కార్యాలయ వాతావరణం ఉత్పాదకతను పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
బీపీసీఎల్ రాష్ట్ర స్థాయి అధిపతి లక్ష్మిల్ చౌహాన్ మాట్లాడుతూ పరిశుభ్రత, భద్రతను కేవలం ప్రచార కార్యక్రమాలకే పరిమితం చేయకుండా ప్రతి ఉద్యోగి రోజువారీ పని సంస్కృతిలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. కార్యస్థల పరిశుభ్రత, భద్రతలో సింగరేణి ఉన్నత ప్రమాణాలు పాటిస్తోందని ప్రశంసిస్తూ, ఉద్యోగులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.
బీపీసీఎల్ చీఫ్ మేనేజర్ (మార్కెటింగ్) రఘునాథరావు మాట్లాడుతూ స్వచ్ఛతా పఖ్వాడా ప్రధాన ఉద్దేశం పరిశుభ్రత, భద్రతపై అవగాహన పెంపొందించడం, పరిశుభ్రమైన, సురక్షితమైన, పచ్చని కార్యస్థలాల నిర్వహణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమేనని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణతో పాటు కార్యస్థల ప్రమాణాలను మరింత మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమం ముగింపులో సింగరేణి అధికారులు మొక్కలు నాటి పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, కార్యస్థల భద్రత పట్ల తమ నిబద్ధతను మరోసారి చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో బీపీసీఎల్ అధికారులు సింహాచలం, దీపక్ శివాజీ తదితరులు పాల్గొన్నారు.

