◆ ఏపీ జల చౌర్యంపై రేవంత్ ప్రభుత్వం మౌనం
◆ వెలుగొండ ప్రారంభం తెలంగాణకు దుర్దినం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
ప్రజానావ ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో : కృష్ణా వరద జలాలు మాత్రమే వాడుకోవాల్సిన వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఏపీ ప్రభుత్వం ఎదేచ్ఛగా నికర జలాలను తరలిస్తుంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నోరు మెదపకపోవడం తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. వెలుగొండ ప్రాజెక్టు ప్రారంభం తెలంగాణకు ఒక ‘దుర్దినం’ అని అభివర్ణించారు.
మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాల కేటాయింపుల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వైట్ బోర్డుపై డయాగ్రమ్స్ ద్వారా సుదీర్ఘంగా వివరించారు. తెలంగాణ సాగునీటి విషయంలో కాంగ్రెస్ మొదటి నుంచీ ప్రధాన శత్రువుగా వ్యవహరిస్తోందని, చంద్రబాబు జలచౌర్యానికి రేవంత్ ప్రభుత్వం లొంగిపోయిందని విమర్శించారు.
బీఆర్ఎస్ హయాంలో 90 శాతం పూర్తయిన పీఆర్ఎల్ఐఎస్ ప్రాజెక్టును కాంగ్రెస్ పక్కనబెట్టిందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం 235 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటుంటే, తెలంగాణలోని ఎస్ఎల్బీసీ పనులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రాజెక్టుల కోసం నిజాయితీగా పోరాడామని, బీఆర్ఎస్ నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

