◆ ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీలు, సభలపై నిషేధం
◆ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎస్పీ డి.జానకి
ప్రజానావ ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో : జిల్లా వ్యాప్తంగా శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజా ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 1 నుంచి 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ కాలంలో ముందస్తు పోలీసు అనుమతి లేకుండా ఎలాంటి ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, నిరసనలు, బహిరంగ సభలు నిర్వహించరాదని సూచించారు. నిబంధనలను ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే సోషల్ మీడియా ద్వారా వదంతులు, మత విద్వేషాలు లేదా సామాజిక ఉద్రిక్తతలకు దారితీసే పోస్టులు ప్రచారం చేసే వారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు. సభలు, సమావేశాలు నిర్వహించాలనుకునే వారు తప్పనిసరిగా పోలీసుల అనుమతి పొందాలని, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలందరూ సహకరించాలని ఎస్పీ కోరారు.

