* సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ద ప్రకాశ్ జ్యోతితో మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధుల భేటీ
హైదరాబాద్: కీలక ఖనిజాలు (క్రిటికల్ మినరల్స్) పుష్కలంగా ఉన్న ఆస్ట్రేలియాలో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ప్రముఖ పరిశోధనా సంస్థ మోనాష్ యూనివర్సిటీ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌ను ఆహ్వానించింది. ఈ మేరకు మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధి బృందం సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ద ప్రకాశ్ జ్యోతితో సమావేశమైంది.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలో క్రిటికల్ మినరల్స్ రంగంలో ఉన్న అవకాశాలను మోనాష్ యూనివర్సిటీ బృందం సింగరేణి సీఎండీకి వివరించింది. క్రిటికల్ మినరల్స్ రంగంలో అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యాన్ని ఆస్ట్రేలియా కోరుకుంటోందని, మైనింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన సింగరేణిని పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యం కోసం ఆహ్వానిస్తున్నట్లు ప్రతినిధులు తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్‌కు డిమాండ్ వేగంగా పెరుగుతోందని పేర్కొన్న మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధులు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పర్యావరణహిత మైనింగ్ విధానాలు, లాభదాయకమైన వ్యూహాత్మక వ్యాపార చర్యలపై సాంకేతిక సహకారం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. పరిశోధన, విద్య, పరిశ్రమలతో భాగస్వామ్యం, పరిశోధన ఫలితాలను వాణిజ్యపరమైన సాంకేతిక పరిష్కారాలుగా మార్చడంలో మోనాష్ యూనివర్సిటీకి ఉన్న అనుభవాన్ని వివరించారు.
అన్వేషణ నుంచి విలువ ఆధారిత ఉత్పత్తుల వరకు:
ప్రపంచవ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం, వాటి అన్వేషణ, వెలికితీత, ప్రాసెసింగ్, రిఫైనింగ్‌తో పాటు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో ఉన్న అవకాశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముడి ఖనిజాల వెలికితీతకే పరిమితం కాకుండా డౌన్‌స్ట్రీమ్ ప్రాసెసింగ్, రిఫైనింగ్ ద్వారా అదనపు విలువను సృష్టించే అవకాశాలను మోనాష్ యూనివర్సిటీ బృందం వివరించింది.
మైనింగ్ రంగంలో సుస్థిరత, పర్యావరణహిత విధానాలు, మైన్ క్లోజర్ ప్లానింగ్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి వంటి అంశాల్లో తమ సేవలను వినియోగించుకోవాలని ప్రతినిధులు సూచించారు.
కర్ణాటకలో బంగారం–రాగి అన్వేషణ:
ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్రిటికల్ మినరల్స్ రంగంలోకి ప్రవేశించేందుకు సింగరేణి చేపడుతున్న చర్యలను సంస్థ అధికారులు మోనాష్ యూనివర్సిటీ ప్రతినిధులకు వివరించారు. ఇటీవలే కర్ణాటకలో బంగారం–రాగి గనుల అన్వేషణను ప్రారంభించినట్లు తెలిపారు.
క్రిటికల్ మినరల్స్ రంగంలో పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యం కోసం అంతర్జాతీయంగా ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ద ప్రకాశ్ జ్యోతి తెలిపారు. మోనాష్ యూనివర్సిటీ–సింగరేణి మధ్య పరిశోధన, ఆధునిక సాంకేతికత, క్రిటికల్ మినరల్స్, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాల్లో భవిష్యత్ సహకార అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు.
త్వరలో సింగరేణి ఉన్నతస్థాయి అధికారుల బృందాన్ని ఆస్ట్రేలియాకు పంపించి అక్కడి అవకాశాలను పరిశీలిస్తామని సీఎండీ వెల్లడించారు.
సమావేశంలో సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్)గౌతమ్ పోట్రు, జీఎం (కో-ఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్, కొత్తగూడెం కార్పొరేట్ కార్యాలయం నుంచి డైరెక్టర్ (ఆపరేషన్స్)ఎల్వీ సూర్యనారాయణ, డైరెక్టర్ (పీపీ) కె. వెంకటేశ్వర్లు, జీఎం (బీడీ)రాందాస్, జీఎం (ఎక్స్‌ప్లోరేషన్) పంకజ్ కులశ్రేష్ట, మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్ యానిస్ వెంటికోస్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

