* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* అన్ని మండలాల్లో జరుగుతున్న రహదారి పనులను వేగవంతం చేయాలి
* పనుల నాణ్యతలో రాజీ లేకుండా నిర్దేశిత గడువులో పూర్తి చేయాలి
* ఆర్‌అండ్‌బీ పనుల పురోగతిపై ఏఈలు, డీఈలతో సమీక్షించిన కలెక్టర్
పెద్దపల్లి బ్యూరో : జిల్లాలో రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వచ్చే మార్చి నెలలోగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఆర్‌అండ్‌బీ శాఖ పనులపై జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని మండలాల్లో జరుగుతున్న రహదారులు, భవనాలు, ఇతర ఆర్‌అండ్‌బీ పనుల పురోగతిని మండలాల వారీగా సమీక్షించారు. పనులు ప్రారంభం కానివి, వివిధ దశల్లో ఉన్నవి, పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో చేపడుతున్న అన్ని ఆర్‌అండ్‌బీ పనులను వేగవంతం చేసి మార్చి నెలలోగా పూర్తి చేయాలని సూచించారు. పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ పనులు నిర్దేశిత గడువులోగా పూర్తయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా రహదారి పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని అధికారులను ఆదేశించారు. నిబంధనల ప్రకారం పనులను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, పనుల పురోగతి, నాణ్యత, బిల్లుల చెల్లింపులను సమర్థవంతంగా పర్యవేక్షించాలని సూచించారు.
ప్రతి పనికి సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి మండలంలో చేపడుతున్న ఆర్‌అండ్‌బీ పనులకు సంబంధించి నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవడంతో పాటు, వివిధ దశల్లో ఉన్న పనులను వేగవంతం చేయాలని, పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే విధంగా నాణ్యతతో కూడిన రహదారులు, భవనాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈ ఈ భావ్ సింగ్, ఏఈలు, డీఈలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

