◆ 78వ రోజుకు చేరిన అఖిలపక్ష నాయకుల రిలే నిరాహార దీక్షలు
ప్రజానావ ఉమ్మడి మహబూబ్‌నగర్ బ్యూరో : పరిపాలనా సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తమ గ్రామాన్ని వనపర్తి జిల్లా నుంచి తొలగించి, తిరిగి నాగర్‌కర్నూల్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ తల్పునూర్ గ్రామస్థులు చేపట్టిన ఆందోళన తీవ్రతరమవుతోంది. అఖిలపక్ష నాయకుల నేతృత్వంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 78వ రోజుకు చేరుకున్నాయి.
ఈ సందర్భంగా నాయకులు, గ్రామస్థులు మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ పట్టణం తమ గ్రామానికి కేవలం 14 కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నారు. దీంతో విద్యా, వైద్యం, వ్యవసాయం తదితర నిత్యవసరాల కోసం మొదటి నుంచీ నాగర్‌కర్నూల్‌పైనే ఆధారపడుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఉన్న వనపర్తి జిల్లా కేంద్రం 30 కిలోమీటర్ల దూరంలో ఉండటంతో పాటు సరైన రవాణా సౌకర్యాలు లేకపోవడంతో నిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోనే ఉన్న తల్పునూర్‌ను ప్రజల అవసరాలకు అనుగుణంగా వెంటనే తిరిగి నాగర్‌కర్నూల్‌లోనే విలీనం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

