Friday, September 4, 2026

Buy now

సింగరేణితో ఇంధన ఒప్పందం ఉన్న థర్మల్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేయాలి

* కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆదేశం

హైదరాబాద్, సెప్టెంబర్ 1: దేశంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు తగినంత బొగ్గు సరఫరా చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రభుత్వ రంగ బొగ్గు ఉత్పత్తి సంస్థలను ఆదేశించారు.

మంగళవారం సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థలతో థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దేశంలోని 28 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో తక్కువ బొగ్గు నిల్వలు ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆయా కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్న ప్రభుత్వ సంస్థలు తక్షణమే స్పందించి, ఎలాంటి కొరత ఏర్పడకుండా బొగ్గు రవాణాను పెంచాలని ఆదేశించారు.

సింగరేణి సంస్థ కూడా తనతో ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు ఎప్పటిలాగే తగినంత బొగ్గును సజావుగా సరఫరా చేయాలని కిషన్ రెడ్డి సూచించారు. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా బొగ్గు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి మాట్లాడుతూ, ఇంధన సరఫరా ఒప్పందం ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సింగరేణి ఇప్పటికే తగినంత బొగ్గును సరఫరా చేస్తోందని తెలిపారు. భవిష్యత్తులో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరింత సమర్థవంతంగా బొగ్గు సరఫరా చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) గౌతమ్ పోట్రు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూవ్‌మెంట్) బి. వెంకన్న, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్ అండ్ మార్కెటింగ్) తాడబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు. కొత్తగూడెం హెడ్ ఆఫీస్ నుంచి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) ఎం. తిరుమలరావు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular