Friday, September 4, 2026

Buy now

సింగరేణి భూగర్భ గనుల ప్రైవేటీకరణ వార్తలు అవాస్తవం

* భూగర్భ గనులను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ లేదు
* సింగరేణి యాజమాన్యం స్పష్టీకరణ

హైదరాబాద్, సెప్టెంబర్ 2: సింగరేణి భూగర్భ బొగ్గు గనులను ప్రైవేటుపరం చేస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది. భూగర్భ గనులను ప్రైవేటీకరించేందుకు ప్రస్తుతం సంస్థ వద్ద ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని వెల్లడించింది.

ప్రస్తుతం సింగరేణి 21 భూగర్భ, 17 ఓపెన్‌కాస్ట్ గనుల ద్వారా బొగ్గు ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. తెలంగాణతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు బొగ్గును సరఫరా చేస్తూ దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధికి సంస్థ తన వంతు సహకారం అందిస్తోందని పేర్కొంది.

నష్టాల్లో ఉన్నా భూగర్భ గనుల కొనసాగింపు:
సింగరేణిలోని కొన్ని భూగర్భ గనులు ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ, తెలంగాణ ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకుని వాటిని కొనసాగిస్తున్నట్లు యాజమాన్యం తెలిపింది. గనులను మూసివేయడం లేదా ప్రైవేటుపరం చేయడం కాకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, నిర్వహణ వ్యయాలను తగ్గించడం ద్వారా సాధ్యమైనన్ని గనులను లాభదాయకంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

శాంతిఖని ఈఓఐపై స్పష్టత:
భారీ నష్టాల్లో కొనసాగుతున్న శాంతిఖని భూగర్భ గనిలో ఉత్పత్తి కార్యకలాపాలను ఎండీఓ (మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్) విధానంలో నిర్వహించడం ద్వారా ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, నష్టాలను నివారించే అవకాశాలను అధ్యయనం చేసేందుకు మాత్రమే పైలట్ ప్రాజెక్టుగా ప్రతిపాదన రూపొందించినట్లు సింగరేణి తెలిపింది.

ఇందులో భాగంగా జనవరి 2న ఈఓఐ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్) ప్రకటన జారీ చేసి ఆసక్తిగల సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించినట్లు పేర్కొంది. తొలుత జనవరి 15 వరకు గడువు ఇవ్వగా ఎవరూ ఆసక్తి వ్యక్తం చేయలేదని, అనంతరం జనవరి 22 వరకు గడువు పొడిగించగా ఒక సంస్థ ముందుకొచ్చిందని తెలిపింది. అయితే తదుపరి దశలో ఆ సంస్థ కూడా ప్రక్రియలో కొనసాగేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదని వెల్లడించింది.తగిన స్పందన లభించకపోవడంతో శాంతిఖని ఈఓఐ ప్రక్రియను విరమించుకున్నట్లు సింగరేణి యాజమాన్యం స్పష్టం చేసింది.
శాంతిఖని గనికి సంబంధించిన ఈఓఐ ఆధారంగా సింగరేణి భూగర్భ గనులను ప్రైవేటీకరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవ విరుద్ధమని పేర్కొంది.

ఉపాధి పరిరక్షణే లక్ష్యం
భూగర్భ గనులను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, నష్టాలను తగ్గించడం, సాధ్యమైనన్ని గనులను లాభదాయకంగా మార్చడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుత ఉపాధి అవకాశాలను పరిరక్షించడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడమే సంస్థ లక్ష్యమని యాజమాన్యం తెలిపింది.

వాస్తవాలను నిర్ధారించుకోకుండా ఇటువంటి వార్తలను ప్రచురించడం వల్ల ఉద్యోగులు, వారి కుటుంబాలు, ప్రజల్లో అనవసర ఆందోళన ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

Related Articles

spot_img

Most Popular