* కీలక పదవుల్లో మార్పులు.. మహిళా కమిషన్, KUDAకు కొత్త చైర్‌పర్సన్ల నియామకం
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రి కొండా సురేఖను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతూ గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్‌కు లేఖ పంపినట్లు సమాచారం. కొండా కుటుంబం రాజకీయంగా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కొండా కుటుంబం నోటి దురుసు కారణంగానే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొంటోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. గతంలో రోశయ్య, అనంతరం కేసీఆర్, హరీశ్ రావులతో, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితోనూ ఇదే తరహాలో వివాదాలు చోటుచేసుకున్నాయని వారు పేర్కొంటున్నారు.
చిన్నారెడ్డి పదవికి ప్రభుత్వం ముగింపు:
ఇదిలా ఉండగా మాజీ మంత్రి చిన్నారెడ్డిను తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన స్థానంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
KUDAకు జి. సుధారాణి
కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (KUDA) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధారాణి నియామకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.తాజా నిర్ణయాలతో తెలంగాణ ప్రభుత్వంలోని పలు కీలక పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

