Friday, September 4, 2026

Buy now

కేసీఆర్ రాజీనామా చేయాలంటూ వేములవాడలో కాంగ్రెస్ భారీ ర్యాలీ

* 500 మీటర్ల మేర ఫ్లెక్సీల ప్రదర్శన.. భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు

వేములవాడ: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో ప్రతిపక్ష నేత, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సుమారు 500 మీటర్ల మేర గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు.

‘కల్వకుంట్ల కుటుంబం రాష్ట్ర ప్రజలకు బాకీ ఉంది’:
ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు కల్వకుంట్ల కుటుంబం బాకీ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లభిస్తున్న ప్రజాదరణను చూసి బీఆర్‌ఎస్‌కు చెందిన ‘బావా బామ్మర్దులు’ భయపడుతున్నారని విమర్శించారు.

‘అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడని కేసీఆర్’:
అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడని కేసీఆర్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండే పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తోందని పేర్కొన్నారు.

‘బీఆర్‌ఎస్‌ది ఫామ్‌హౌస్ పాలన.. కాంగ్రెస్‌ది ప్రజా పాలన’ అని నినదిస్తూ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. భారీ ర్యాలీతో వేములవాడ పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.

Related Articles

spot_img

Most Popular