Friday, September 4, 2026

Buy now

టాస్క్ కేంద్రంలో సెప్టెంబర్ 8 నుంచి కొత్త బ్యాచ్‌లు

* పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
* బస్ డిపో ప్రవేశ ద్వారం పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేయాలి
* టాస్క్ కేంద్రంలో సెప్టెంబర్ 8 నుంచి కొత్త బ్యాచ్‌లు
* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులను సద్వినియోగం చేసుకోవాలి
* ప్రభుత్వ జూనియర్ కళాశాల పునరుద్ధరణ పనులను త్వరగా పూర్తి చేయాలి
* జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్.

పెద్దపల్లి : జిల్లా కేంద్రంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి ప్రజలకు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ పెద్దపల్లి బస్ స్టాండ్ సమీపంలో కొనసాగుతున్న బస్ డిపో నిర్మాణ పనులు, టాస్క్ కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

పెద్దపల్లి బస్ డిపో నిర్మాణ పనులను పరిశీలించి, పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. బస్ డిపో నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. బస్ డిపోకు ఏర్పాటు చేయనున్న ప్రవేశ ద్వారం పక్కా ప్రణాళికతో రూపొందించాలని, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తగిన విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు.

బస్ డిపోలో ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక వసతులను సముచితంగా కల్పించాలని ఆదేశించారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో చేపట్టాలని, పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

అనంతరం పెద్దపల్లి టాస్క్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో విద్యార్థులకు అందిస్తున్న శిక్షణ, వివిధ కోర్సులు, శిక్షణ పొందుతున్న విద్యార్థుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ తదితర ఆధునిక సాంకేతిక అంశాల్లో టాస్క్ కేంద్రం ద్వారా శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు వివరించారు.

టాస్క్ కేంద్రంలో సెప్టెంబర్ 8 నుంచి కొత్త బ్యాచ్‌లు ప్రారంభం కానున్నందున ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. టాస్క్ కేంద్రంలో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ప్రముఖ బహుళజాతి సంస్థలు, ఇతర ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు పొందుతున్నారని అధికారులు వివరించారు.

ఫాక్స్‌కాన్ కంపెనీలో ఉద్యోగాలు పొందిన కొంతమంది విద్యార్థులతో జిల్లా కలెక్టర్ వీడియో కాల్ ద్వారా మాట్లాడి వారి ఉద్యోగ అనుభవాలను తెలుసుకున్నారు. టాస్క్ కేంద్రం ద్వారా అందిస్తున్న శిక్షణను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు.

కళాశాల భవనం, తరగతి గదులు తదితర ప్రాంతాల్లో చేపడుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు అనుకూలమైన విద్యా వాతావరణం కల్పించేలా కళాశాలలో అవసరమైన మౌలిక వసతులను సమకూర్చాలని, పునరుద్ధరణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.

అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా ఉపాధి అధికారి ఎం. రాజశేఖర్, టాస్క్ పెద్దపల్లి ప్రాంతీయ కేంద్రం ఇన్‌చార్జి కౌసల్య, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular