Friday, September 4, 2026

Buy now

ధాన్యం కొనుగోళ్లలో పారదర్శకతకు పిసిఎస్ఏపి యాప్

* సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్
* పిసిఎస్ఏపి యాప్‌లో ఏఐ సాంకేతికత ద్వారా తప్పుడు వివరాలను గుర్తించే అవకాశం
* కొనుగోలు కేంద్రాల సిబ్బందికి యాప్ వినియోగంపై పూర్తి స్థాయిలో శిక్షణ, అవగాహన కల్పించాలి
* తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ యాప్‌ వినియోగానికి అవకాశం
* అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సివిల్ సప్లైస్ డైరెక్టర్

పెద్దపల్లి : రానున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026-27లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు కొనుగోలు కేంద్రాల స్మార్ట్‌ మదింపు (పిసిఎస్ఏపి) యాప్ ను వినియోగించాలని సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.

గురువారం ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2026-27లో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కనీస సౌకర్యాలు, పిసిఎస్ఏపి యాప్ వినియోగం, కొనుగోలు కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై రాష్ట్రంలోని అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ నుంచి అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సివిల్ సప్లైస్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ రానున్న ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ నుంచి ధాన్యం కొనుగోళ్లలో మరింత పారదర్శకత తీసుకురావడానికి పిసిఎస్ఏపి యాప్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి సంబంధించిన గన్నీ బ్యాగుల నిల్వ, ధాన్యం కొనుగోలు వివరాలు, రవాణా వివరాలను యాప్‌లో ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

పిసిఎస్ఏపి లో భాగంగా ప్రతి కొనుగోలు కేంద్రానికి సంబంధించిన కేంద్రం పేరు, ప్రదేశం, సంబంధిత సీజన్ తదితర ప్రాథమిక వివరాలను నమోదు చేయడంతో పాటు, కేంద్రంలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలను స్వీయ మదింపు విధానంలో నమోదు చేయాలని సూచించారు. రైతులకు అందుతున్న సౌకర్యాలు, తూకం, నిల్వ, ధాన్యం నాణ్యత పరీక్ష తదితర అంశాలను కూడా ఇందులో నమోదు చేసి అంచనా వేయడం జరుగుతుందని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల నిల్వ, కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం, రవాణా వివరాలు తదితర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన ఆదేశించారు. దీంతో కొనుగోలు కేంద్రాల వారీగా అందుబాటులో ఉన్న సదుపాయాలు, ధాన్యం కొనుగోలు పురోగతి, రవాణా ప్రక్రియను డిజిటల్ విధానంలో పర్యవేక్షించేందుకు వీలుంటుందని తెలిపారు.

పిసిఎస్ఏపి లో కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమ కేంద్రానికి సంబంధించిన స్వీయ మదింపు వివరాలను నమోదు చేయడంతో పాటు, సంబంధిత అధికారులు నమోదు చేసిన వివరాలను పరిశీలించి ధృవీకరించే అవకాశం ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని సంబంధిత అధికారులు కూడా ఈ వివరాలను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే విధంగా యాప్‌ను రూపొందించినట్లు పేర్కొన్నారు. గత సీజన్లలో నమోదు చేసిన వివరాల ఆధారంగా కొనుగోలు కేంద్రాల పరిపక్వత స్థాయిని కూడా పరిశీలించే అవకాశం ఉంటుందని తెలిపారు.

గతంలో నమోదైన సమాచారం, ప్రస్తుత సీజన్‌లో కేంద్రం పనితీరు, అందుబాటులో ఉన్న సదుపాయాల ఆధారంగా కొనుగోలు కేంద్రాల స్థాయిని అంచనా వేసేందుకు ఇది ఉపయోగపడుతుందని వివరించారు. పిసిఎస్ఏపి లో కృత్రిమ మేధస్సు ఆధారిత చిత్రాల ధృవీకరణ సాంకేతికతను వినియోగించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు సివిల్ సప్లైస్ డైరెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించిన ఫోటోలు, చిత్రాల ఆధారంగా నమోదు చేసిన వివరాలను సాంకేతికంగా ధృవీకరించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

తప్పుడు లేదా వాస్తవ పరిస్థితులకు విరుద్ధమైన వివరాలను నమోదు చేయకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పిసిఎస్ఏపి యాప్‌ను తెలుగు భాషలో కూడా వినియోగించుకునే అవకాశం ఉండేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. స్థానిక స్థాయిలో పనిచేసే సిబ్బందికి యాప్ వినియోగం సులభంగా ఉండేలా భాషా సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

పిసిఎస్ఏపి యాప్ వినియోగంపై కొనుగోలు కేంద్రాల్లో పనిచేసే అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. యాప్‌లో కేంద్ర వివరాలు నమోదు చేయడం, స్వీయ మదింపు నిర్వహించడం, గన్నీ బ్యాగులు, ధాన్యం కొనుగోలు, రవాణా వివరాలను నమోదు చేయడం, అవసరమైన చిత్రాలను అప్‌లోడ్ చేయడం, నమోదు చేసిన సమాచారాన్ని ధృవీకరించడం వంటి అంశాలపై ప్రాయోజిక శిక్షణ అందించాలని సూచించారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యే ముందే సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించి శిక్షణ, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

పిసిఎస్ఏపి వినియోగంపై క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన కల్పించి, యాప్‌లో వివరాల నమోదులో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనాథ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular