* సంస్థను లాంఛనంగా ప్రారంభించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
* సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడంలో AI, సైబర్ సెక్యూరిటీ కీలకం
* పరిశోధన ఆధారిత స్టార్టప్‌లతో హైదరాబాద్ గ్లోబల్ ఐటీ హబ్‌గా ఎదగాలి
హైదరాబాద్: హైదరాబాద్‌లోని T-Works ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సంస్థ ‘ZenC Labs’ ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి సంస్థను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, సమాచార సాంకేతిక రంగంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ బెదిరింపులను అరికట్టడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దడంలో పరిశోధన ఆధారిత స్టార్టప్‌లు, నూతన సాంకేతిక సంస్థలు ఎంతో దోహదపడతాయని ఆయన ఆకాంక్షించారు. సైబర్ భద్రతకు పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే సంస్థలు మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు.
అత్యాధునిక సాంకేతికతతో ZenC Labsను ఏర్పాటు చేసిన ఫౌండర్, సీఈఓ రవి పుత్తాతో పాటు సంస్థ బృందాన్ని ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. సంస్థ భవిష్యత్‌లో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ZenC Labs చీఫ్ మెంటార్ మురళి తలసిల, అరబిందో ఫార్మా గ్రూప్ సీఐఓ చిట్టి బాబు, వాల్యూమోమెంటమ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భరత్ అయ్యంగార్‌తో పాటు పలువురు సైబర్ సెక్యూరిటీ నిపుణులు, సాంకేతిక రంగ ప్రముఖులు పాల్గొన్నారు.

