Sunday, September 6, 2026

Buy now

అవినీతి అధికారుల వెనుక ఉన్న మూలకారకుల సంగతేంటి!

హైదరాబాద్:గత ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడి రూ.వేల కోట్లు కొల్లగొట్టిన అధికారుల గుట్టును ఏసీబీ ద్వారా ప్రభుత్వం బయటపెడుతోందని, అయితే ఆ అవినీతికి మూలకారకులుగా ఉన్న వారి సంగతేంటని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ మేరకు సోమవారం ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా ఆమె పోస్ట్ చేశారు.

గత ప్రభుత్వంలోనే కాకుండా ప్రస్తుత ప్రభుత్వంలోనూ అధికారులు వందల, వేల కోట్ల ప్రజాధనం దోచుకునేందుకు వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తున్న వారి గురించి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కవిత నిలదీశారు.

అధికారులను ముందు పెట్టి రూ.వేల కోట్లు దోచుకుంటున్న వారి నుంచి అవినీతి సొమ్మును కక్కించేందుకు చర్యలు తీసుకునేది ఎవరని ప్రశ్నించారు. అవినీతికి అధికారులను బాధ్యులను చేస్తున్న ప్రభుత్వం.. వారిని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను దోపిడీ చేస్తున్న వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎవరిదని నిలదీశారు.

తమకు మంచి చేస్తారని నమ్మి ప్రజలు అధికారాన్ని అప్పగిస్తే.. భవిష్యత్ తరాలకు చెందాల్సిన సంపదను కొల్లగొడుతున్న వారిని చూస్తూ ఊరుకోవాలా అని కవిత ప్రశ్నించారు.అవినీతికి పాల్పడిన అధికారులతో పాటు, వారి వెనుక ఉండి వ్యవస్థలను దోపిడీ చేస్తున్న అసలు మూలకారకులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.తాను లేవనెత్తిన ప్రశ్నలపై పౌర సమాజం సీరియస్‌గా చర్చించాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

Related Articles

spot_img

Most Popular