# పోటీ మార్కెట్లో నిలబడేందుకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలి
# తెలంగాణ ఇంధన అవసరాలు తీర్చడమే ప్రధాన ప్రాధాన్యం
# వ్యాపార విస్తరణతో సింగరేణి భవిష్యత్తుకు బలమైన పునాదులు
# రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పురోగమిస్తున్న సింగరేణి
కొత్తగూడెం: రాష్ట్ర ప్రభుత్వ చొరవ, సహకారంతో సింగరేణి సంస్థకు రెండు కీలక బొగ్గు బ్లాకులు లభించాయని, రానున్న రోజుల్లో మరిన్ని గనులను సాధించడం ద్వారా సంస్థకు నూతన జవసత్వాలు వస్తాయని సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి అన్నారు. తెలంగాణ విద్యుత్ అవసరాలకు సరిపడా బొగ్గును అందించడంతో పాటు దేశ సేవలో సింగరేణి మరింత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో నిర్వహించిన “80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సెంట్రల్ ఫంక్షన్‌కు సీఎండీ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన సంస్థ ఉద్యోగులు, కార్మికులు, అధికారులను ఉద్దేశించి ప్రసంగించారు.
# తాడిచర్ల–2 బ్లాక్‌తో 40 ఏళ్ల బొగ్గు ఉత్పత్తి అవకాశం
సింగరేణి సంస్థ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు లభించిందని సీఎండీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేయడం వల్ల ఈ బ్లాక్ సంస్థకు దక్కిందని, దీని ద్వారా సుమారు 340 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే అవకాశం లభించిందని చెప్పారు.
ఈ బ్లాక్‌లో సుమారు 40 సంవత్సరాల పాటు మైనింగ్ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉండటం సింగరేణి భవిష్యత్తుకు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మణుగూరు ఏరియాకు భవిష్యత్తును అందించే పీకే ఓసీ–2 డిప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణి వేలంలో దక్కించుకుందని తెలిపారు. ఈ బ్లాక్ ద్వారా సుమారు 120 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను వెలికితీసే అవకాశం ఉందని, ఇది మణుగూరుతో పాటు కొత్తగూడెం రీజియన్ అభివృద్ధికి దోహదపడుతుందని వివరించారు.
# రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు
సింగరేణి అభివృద్ధి, విస్తరణపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సంస్థ ఉన్నతికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు యాజమాన్యం తరఫున సీఎండీ కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సింగరేణి సంస్థ మరింత విస్తరించేందుకు, కొత్త గనులను సాధించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
# క్రిటికల్ మినరల్స్ రంగంలోకి సింగరేణి
వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా సింగరేణి సంస్థ “క్రిటికల్ మినరల్స్ రంగంలోకి” ప్రవేశిస్తోందని సీఎండీ వెల్లడించారు. కర్ణాటకలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ సాధించామని, త్వరలోనే అన్వేషణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను వెలికితీసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన “సింగరేణి జియో సైన్స్ ల్యాబొరేటరీని” ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇటీవల ప్రారంభించారని, ఈ ల్యాబొరేటరీ కీలక ఖనిజాల అన్వేషణకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.
# తెలంగాణ విద్యుత్ అవసరాలకు అధిక బొగ్గు సరఫరా
సింగరేణికి రాష్ట్ర ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని సీఎండీ స్పష్టం చేశారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అధిక మొత్తంలో బొగ్గును సరఫరా చేస్తున్నామని తెలిపారు.
అదేవిధంగా ఒడిశాలోని “నైనీ బొగ్గు బ్లాక్‌లో ఉత్పత్తి అవుతున్న బొగ్గును ఎస్టీపీపీకి” తరలిస్తున్నామని చెప్పారు. ఇది సింగరేణి చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
# భద్రతతో కూడిన ఉత్పత్తే లక్ష్యం
సింగరేణి బొగ్గు గనుల్లో ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేస్తామని సీఎండీ తెలిపారు. తక్కువ ఖర్చుతో నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయడమే సంస్థ లక్ష్యమన్నారు.
సింగరేణి పోటీ మార్కెట్లో నిలబడాలంటే భద్రతతో పనిచేస్తూనే ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు ఖర్చు నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.
అత్యాధునిక మైనింగ్ విధానాలను అవలంబించడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక ఉత్పత్తిని సాధించవచ్చని అన్నారు. భారీ యంత్రాలు, మానవ వనరులను పూర్తి పనిగంటలు సమర్థవంతంగా వినియోగించినప్పుడే సంస్థకు మరింత ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.
అదే సమయంలో డైవర్సిఫికేషన్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని, నూతన మైనింగ్ విధానాలను అమలు చేయాలని సూచించారు.
# కార్మిక సంక్షేమానికి ప్రాధాన్యం
కార్మిక సంక్షేమానికి సింగరేణి సంస్థ కట్టుబడి ఉందని సీఎండీ తెలిపారు. కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఇప్పటికే పలు చర్యలు చేపట్టామని చెప్పారు.
రామగుండం ఏరియా ఆసుపత్రిలో అత్యవసర గుండె జబ్బుల చికిత్స కోసం “క్యాథ్ ల్యాబ్‌ను” ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్మికుల సంక్షేమంతో పాటు సంస్థను మరింత పటిష్టమైన జాతీయ స్థాయి మైనింగ్ సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమష్టి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
# ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
సెంట్రల్ ఫంక్షన్ ప్రాంగణానికి చేరుకున్న సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతికి సంస్థ డైరెక్టర్లు, కార్మిక సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఎస్‌అండ్‌పీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, కలర్ పార్టీ, వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు నిర్వహించిన కవాతును సీఎండీ పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు.
కార్యక్రమంలో డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్య నారాయణ, డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు, డైరెక్టర్ (పర్సనల్ అండ్ ఫైనాన్స్) గౌతమ్ పోట్రు, ఐఏఎస్, డైరెక్టర్ (ఈ అండ్ ఎం) తిరుమలరావు, గుర్తింపు, ప్రాతినిధ్య, అధికార సంఘాల నాయకులు సీతారామయ్య,త్యాగరాజన్,పెద్ది నర్సింహులు, వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.
# ఉత్తమ కార్మికులు, అధికారులకు సన్మానం
సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి ఎంపికైన “ఉత్తమ కార్మికులు, అధికారులను” సీఎండీ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి, ఇతర అతిథులు ఘనంగా సన్మానించారు. సంస్థ అభివృద్ధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను అభినందించారు.
అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఉద్యోగులు, అధికారులు, విద్యార్థులు, అతిథులు సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు.పోటీ మార్కెట్లో సింగరేణి తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ, రాష్ట్ర ఇంధన అవసరాలను తీర్చడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధిలో మరింత కీలక పాత్ర పోషించే దిశగా ముందుకు సాగుతుందని** సీఎండీ ఆకాంక్షించారు.

