◆ గద్వాలకు నీటిపారుదల నిధులు
◆ రాష్ట్రంలోనే గద్వాలను అగ్రస్థానంలో నిలుపుతాం
◆ గద్వాల నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నాదే: సీఎం రేవంత్
◆ సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సన్మానం
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : గట్టు ఎత్తిపోతల, గుడ్డెందొడ్డి రిజర్వాయర్ల సామర్థ్యం పెంపునకు క్యాబినెట్‌లో నిధులు కేటాయించినందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్‌లోని ఎంసిహెచ్ఆర్డి లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, ప్రత్యేక నిధులు కేటాయించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలుపుతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. గట్టు సామర్థ్యాన్ని 1.3 టీఎంసీల నుంచి 3 టీఎంసీలకు, గుడ్డెందొడ్డి సామర్థ్యాన్ని 1.9 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచి నిధులు మంజూరు చేయడం ద్వారా నియోజకవర్గంలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, రైతాంగానికి శాశ్వతంగా నీటి సమస్య తీరుతుందని ఆనందం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు, రైతుల తరఫున సీఎంకు, క్యాబినెట్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

