* వేములవాడ రాజరాజేశ్వర స్వామి స్థాపనాచార్యుల ప్రత్యేక పూజలు
* హాజరైన తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్
పెద్దపల్లి : పవిత్రమైన శ్రావణమాసం బుధవారం ఉదయం నుండి సాయంత్రం వరకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి స్థాపనాచార్యులు, ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ ఆధ్వర్యంలో వేదమంత్రాల మధ్యలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దత్తత దేవాలయమైన శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయంలో వందలాది భక్తులు భక్తి పారవశ్యంతో తిలకిస్తుండగా శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి (చెట్టు కింద శివయ్య) పున ప్రతిష్ట కార్యక్రమము అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఇంకా ఈ దేవాలయంలో నూతనంగా ఏర్పాటుచేసిన శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ చండీశ్వర స్వామి దేవత విగ్రహాల ప్రతిష్ట అత్యంత ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల క్రితం దేవాలయాన్ని అద్భుతంగా నిర్మించిన విషయం తెలిసిందే. మరో రూ.30 లక్షల ఖర్చుతో దేవాలయంలో ప్రతిష్ట ఉత్సవాలతో పాటు కిచెన్ రూమ్ స్టోర్ రూములను సైతం నిర్మించి వాటిని ఆయన భక్తుల మధ్య ప్రారంభించారు. వేములవాడ దేవస్థానికి చెందిన పలువురు పూజారులతోపాటు రాగినేడు ఆలయ ప్రధాన ప్రూజారి రాజేశ్వర శర్మల వేదమంత్రాలు మధ్య ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రతిష్ట కార్యక్రమాలతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కోలేటి దామోదర్ దంపతులు, కోలేటి శ్రీనివాస్ దంపతులు, రాగినేడు గ్రామ సర్పంచ్ సోమా కుమార్ దంపతులు, గౌరవ అధ్యక్షులు గుమ్మడి విజయ్ దంపతులతో పాటు పలువురు పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజరాజేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ మీడియాతో మాట్లాడుతూ కేవలం మూడు సంవత్సరాల వ్యవధిలోనే రాగినేడులోని స్వయం శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయం అత్యంత ప్రసిద్ధిగాంచిందని తెలిపారు.
ఆ పరమశివుడు ఈ ప్రాంతాల్లో కొలువై అశేష భక్తులకు కొంగు బంగారం గా నిలిచాడన్నారు. దేవాలయ నిర్మాణ కట్ట కోలేటి దామోదర్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్, స్థానికుల సహకారంతో ఈ దేవాలయము అద్భుతంగా రాణిస్తుందని భవిష్యత్తులో మహా పుణ్యక్షేత్రంగా పరిఢమిల్లుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనునిత్యం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వందలాది మంది భక్తులు దేవాలయానికి విచ్చేసి ఆ పరమశివుని దర్శనం చేసుకుని తమ కోరికలను నెరవేర్చుకుంటున్నట్టు ఆయన తెలిపారు.
వీరితో పాటు గ్రామ సర్పంచ్ సోమా కుమార్, గౌరవ అధ్యక్షులు గుమ్మడి తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాగినేడు గ్రామంలోని ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలను తీసుకున్నారు.

