Sunday, September 6, 2026

Buy now

తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశాం: సీఎం రేవంత్ రెడ్డి

# భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తాం
# సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం
# తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం

హైదరాబాద్: గడిచిన రెండున్నరేళ్ల ప్రజా పాలనలో తెలంగాణ పునర్నిర్మాణానికి బలమైన పునాదులు వేశామని, భవిష్యత్తు తెలంగాణ నిర్మాణాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు, ఉద్యోగుల భాగస్వామ్యంతోనే ప్రజా ప్రభుత్వం అనేక విజయాలను సాధించిందని తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో పాటు ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసి, తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పిలుపునిచ్చారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నిరుపేదల ఆర్థిక పురోగతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు చేపట్టిన కార్యక్రమాలను ఆయన సవివరంగా వివరించారు.

## తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు

గడిచిన 32 నెలల్లో ప్రజా ప్రభుత్వం నాలుగు కోట్ల మంది ప్రజలకు సంక్షేమం ద్వారా భరోసా కల్పించిందని సీఎం తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు సామాజిక న్యాయంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని, ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు.

భవిష్యత్తు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికత, నైపుణ్యాలపై బలమైన పునాదులు వేశామని పేర్కొన్నారు. సాధించిన విజయాల ఆధారంగా తెలంగాణను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ‘తెలంగాణ రైజింగ్–2047’ లక్ష్యమని వివరించారు.

ఆర్‌బీఐ తాజా గణాంకాల ప్రకారం 2025–26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931కు చేరిందని, ఇది దేశ తలసరి ఆదాయం కంటే దాదాపు 91 శాతం అధికమని సీఎం తెలిపారు.

# మానవీయతే ప్రభుత్వ సంక్షేమ విధానం

సంక్షేమాన్ని కేవలం ఖర్చు చేసిన రూపాయలతో లెక్కించకుండా మానవీయ కోణంలో చూస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. పేదల జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, ఆత్మగౌరవం తీసుకురావడమే ప్రభుత్వ సంక్షేమ విధానాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది’ అనే నమ్మకంతో రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. వరి సాగు విస్తీర్ణం, దిగుబడిలో తెలంగాణ పంజాబ్‌ను అధిగమించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు.

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా కోసం ప్రభుత్వం రాజీపడదని స్పష్టం చేశారు. తుమ్మడిహెట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పారు.

# కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

తెలంగాణలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని సీఎం తెలిపారు. పేదలకు సన్నబియ్యం అందించే పథకం విప్లవాత్మకమైనదని, ఇది పేదల ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి భరోసా కల్పిస్తోందన్నారు.

93 లక్షలకు పైగా కుటుంబాల్లోని దాదాపు 3.38 కోట్ల మంది ప్రజలను ప్రజా పంపిణీ వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం భరోసా కల్పించిందని, 15 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు జారీ చేశామని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభిస్తున్నామని వెల్లడించారు.

# పేదల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ ఇళ్లు

పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామని సీఎం అన్నారు. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత కార్మికులు సహా 43 లక్షల మందికి సామాజిక భద్రతా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు.

12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న కనీస వేతనాల సవరణను ప్రభుత్వం ఆమోదించిందని, సుమారు 1.11 కోట్ల మంది కార్మికులకు దీని ద్వారా ప్రయోజనం కలిగిందన్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా గిగ్ కార్మికుల సంక్షేమ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు.

# విద్య, ఉద్యోగాలకు అత్యధిక ప్రాధాన్యత

విద్యారంగంలో ప్రజా ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు ఫలితాలను ఇస్తున్నాయని సీఎం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ 28వ స్థానం నుంచి 18వ స్థానానికి చేరిందని తెలిపారు.

తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడాన్ని ప్రభుత్వం అత్యంత కీలక బాధ్యతగా తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు ప్రభుత్వ శాఖల్లో 72 వేలకు పైగా ఉద్యోగ నియామకాలు పూర్తి చేశామని వెల్లడించారు.

గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3, గ్రూప్–4, మెగా డీఎస్సీ నియామకాలను విజయవంతంగా నిర్వహించి, నోటిఫికేషన్ నుంచి పరీక్షలు, ఫలితాలు, ఎంపిక ప్రక్రియ వరకు పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించామని తెలిపారు.

# వైద్యరంగంలో భారీ సంస్కరణలు

ప్రభుత్వ వైద్యరంగాన్ని బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టామని సీఎం వివరించారు. గోషామహల్‌లో 2,000 పడకల నూతన ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టామని తెలిపారు.

వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు సనత్‌నగర్, అల్వాల్, ఎల్బీనగర్‌లో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. తొమ్మిది కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రారంభించామని, మరో ఎనిమిది మెడికల్ కాలేజీలకు కొత్త భవనాలను నిర్మిస్తున్నామని తెలిపారు.

16 కొత్త నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు.

# డ్రగ్స్, ఆహార కల్తీపై కఠిన చర్యలు

డ్రగ్స్, ఆహార కల్తీపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ‘టీజీ సేఫ్’ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఆహార కల్తీ, డ్రగ్స్ నియంత్రణను ఒకే వ్యవస్థ కిందకు తీసుకొచ్చి, ప్రత్యేక లీగల్, ల్యాబొరేటరీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల సమన్వయంతో విస్తృత తనిఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

# ప్రజావాణి మండల స్థాయికి విస్తరణ

ప్రభుత్వ విజయాల్లో ఉద్యోగులు, అధికారులు కీలక భాగస్వాములని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయం పెంచడం నుంచి సంక్షేమ పథకాలను చివరి లబ్ధిదారుడికి చేర్చడం వరకు వారి సహకారం కీలకమన్నారు.

ప్రజల సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపేందుకు ఆగస్టు 17 నుంచి రాష్ట్రంలోని అన్ని ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రతి సోమవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామని, త్వరలో ప్రజావాణి ఆన్‌లైన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించి ఎక్కడి నుంచైనా ప్రజలు అర్జీలు సమర్పించే అవకాశం కల్పిస్తామని చెప్పారు.

# ప్రపంచంతో పోటీ పడుతున్న తెలంగాణ

తెలంగాణ పోటీ ఇతర రాష్ట్రాలతో కాదని, ప్రపంచంతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాల నిర్మాణానికి కార్యాచరణ ప్రారంభించామని తెలిపారు.

బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ప్లాన్‌లో బిజినెస్ ఎంట్రీ, కన్‌స్ట్రక్షన్ పర్మిట్ ఎనేబ్లర్స్, సర్వీస్ సెక్టార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో తెలంగాణ టాప్ అచీవర్‌గా నిలవడం రాష్ట్రంపై పెట్టుబడిదారుల నమ్మకానికి నిదర్శనమన్నారు.

ఈ ఏడాది కూడా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను ప్రపంచానికి చాటిచెబుతామని తెలిపారు.

# ఐటీ రంగంలో తెలంగాణ దూసుకెళ్తోంది

2025–26లో తెలంగాణ ఐటీ ఎగుమతులు రూ.3.97 లక్షల కోట్లకు చేరాయని, ప్రత్యక్ష ఐటీ ఉద్యోగాలు 12.14 లక్షలకు పెరిగాయని సీఎం తెలిపారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం 355కు పైగా గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయని, 2026లో కొత్తగా 40 గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు హైదరాబాద్‌కు వచ్చాయని వెల్లడించారు.

డేటా సెంటర్లు, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న గమ్యస్థానాల్లో ఒకటిగా మారిందన్నారు. అమెజాన్ తెలంగాణలో అదనంగా 7 బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిందని చెప్పారు.

భారత్ ఫ్యూచర్ సిటీ, చందన్‌వెల్లి ప్రాంతాల్లో దేశంలోని అతిపెద్ద హైపర్‌స్కేల్, ఏఐ-రెడీ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్‌లలో ఒకటి రూపుదిద్దుకుంటోందని తెలిపారు.

# ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవనంతో హైదరాబాద్‌కు కొత్త రూపు

భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులు హైదరాబాద్ ముఖచిత్రాన్ని మార్చబోతున్నాయని సీఎం అన్నారు. ఫ్యూచర్ సిటీ కోసం భూములు ఇచ్చిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ప్రభుత్వ ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని కోరిన ఆయన, ఈ ప్రాజెక్టుల వల్ల ఎవరికీ నష్టం, కష్టం రానివ్వబోమని స్పష్టం చేశారు.

“ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి సాధించాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. దైవం ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీస్సులు, సహకారం తోడైతే తెలంగాణ మరిన్ని విజయాలు సాధిస్తుంది. తెలంగాణను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు.

Related Articles

spot_img

Most Popular