ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో: వనపర్తి జిల్లా ఏదుల మండల కేంద్రంతో పాటు చెన్నారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ MD. జబ్బార్ డిమాండ్ చేశారు. శనివారం ఆయా పాఠశాలలను సిపిఎం ప్రతినిధి బృందం సర్వే చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదుల హైస్కూల్‌లో శిథిలావస్థకు చేరిన వంటగదికి మరమ్మతులు చేపట్టాలన్నారు. విద్యార్థులకు నాసిరకం బియ్యంతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారని, ప్రచారానికే పరిమితం కాకుండా నాణ్యమైన సన్న బియ్యం సరఫరా చేయాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా భోజన మెనూ ఛార్జీలు పెంచాలని, విద్యార్థులకు ఉపాహార పథకాన్ని అమలు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమావేశాల కోసం మీటింగ్ హాల్, లైబ్రరీ ఏర్పాటు చేయాలన్నారు.
చెన్నారం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని, ఫిల్టర్ వాటర్, వాచ్‌మెన్, అటెండర్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఖాళీగా ఉన్న రెగ్యులర్ ఎంఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గడ్డికోపుల మహేష్, కోడిగంటి రాజశేఖర్, శీను, రమేష్, భీముడు తదితరులు పాల్గొన్నారు.

