* హైదరాబాద్‌లో టీఆర్ఎస్ కార్యాలయంలో చేరిక కార్యక్రమం
* మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో పార్టీలో చేరిక
* కవిత నాయకత్వంపై విశ్వాసంతో చేరినట్లు నేతల వ్యాఖ్య
హైదరాబాద్: బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలకు చెందిన పలువురు ఆదివాసీ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు. శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వారు అధికారికంగా పార్టీలో చేరారు.
బోథ్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు ఆధ్వర్యంలో తలమడుగు మండలానికి చెందిన ఆదివాసీ నాయకులు హైదరాబాద్‌కు చేరుకోగా, పార్టీ సీనియర్ నేత రూప్ సింగ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రూప్ సింగ్ మాట్లాడుతూ కవిత నాయకత్వంపై విశ్వాసంతోనే ఆయా పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్‌లో చేరినట్లు తెలిపారు. ఆదివాసీల అభ్యున్నతి కోసం కవిత ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వం, అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ పనిచేస్తోందని, పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వంపై నమ్మకంతో చేరిన వారందరికీ అభినందనలు తెలిపారు.
రానున్న రోజుల్లో బోథ్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గజన, దేవర్ల స్వామి, రమేష్, నాయిని శ్రీనివాస్, తీగల ప్రకాష్, శ్రీనివాస్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

