Sunday, September 6, 2026

Buy now

పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదు

* పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

మంథని: పిల్లలు ఆకలితో పాఠశాలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

మంథనిలో సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో సుమారు రూ.7.5 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్‌ను సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం కిచెన్‌లో తయారు చేసిన అల్పాహారాన్ని విద్యార్థులతో కలిసి స్వీకరించి, వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2011లో హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆసుపత్రుల్లోని రోగుల సహాయకులకు ఆహారం అందించే కార్యక్రమం ప్రారంభమైందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమం అమలవుతోందన్నారు.

ట్రస్ట్ వ్యవస్థాపకులు ఏ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద “10 మైళ్ల పరిధిలో ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదు” అనే సందేశం తెలంగాణ ప్రభుత్వానికి స్ఫూర్తిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. ట్రస్ట్‌తో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆహార భద్రత కల్పించే కార్యక్రమాలను చేపడుతోందన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో తొలుత కొడంగల్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ పథకం అమలుతో కొడంగల్ నియోజకవర్గంలో విద్యార్థుల హాజరు 21 శాతం పెరిగిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొడంగల్‌తో పాటు మధిరలోనూ అల్పాహార పథకం అమలవుతోందన్నారు.

జిల్లా కలెక్టర్‌కు ఇచ్చిన సూచనల మేరకు సింగరేణి సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో మంథనిలో ఆధునిక యంత్రాలతో సెంట్రలైజ్డ్ కిచెన్‌ను ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక్కడ గంటకు 10 వేల ఇడ్లీలు, 3 వేల దోసెలు, 5,600 పూరీలు తయారు చేసే సామర్థ్యం ఉందన్నారు.

విద్యార్థులకు ప్రతిరోజూ విభిన్న రకాల అల్పాహారం అందించేలా ప్రత్యేక మెనూను రూపొందించామని తెలిపారు. వారానికి కనీసం మూడు సార్లు విద్యార్థులకు పాలు అందించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని అన్నారు. పిల్లలకు ప్రతిరోజూ ఒకే రకమైన ఆహారం కాకుండా వివిధ రకాల టిఫిన్లను అందిస్తున్నామని పేర్కొన్నారు.

అల్పాహారం తీసుకున్న సందర్భంగా విద్యార్థులతో మంత్రి మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. ఒక విద్యార్థిని గతంలో ఆహారం లేకుండానే పాఠశాలకు హాజరయ్యే పరిస్థితి ఉండేదని తన కష్టాలను మంత్రితో పంచుకుంది. ఇలాంటి పరిస్థితులను విద్యార్థులు ఇకపై ఎదుర్కోకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీధర్ బాబు అన్నారు.

పోషకాహారంతో కూడిన ఆహారం తీసుకోవడం వల్ల విద్యార్థులు చదువుపై మరింత ఏకాగ్రత సాధించడంతో పాటు మంచి ఆరోగ్యం, శారీరక ఎదుగుదల పొందుతారని మంత్రి తెలిపారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అల్పాహార పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.

విద్యకు ప్రత్యేక ప్రాధాన్యం: కలెక్టర్ కోయ శ్రీహర్ష

మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచనల మేరకు జిల్లాలో విద్యాశాఖకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల ప్రకారం విద్యాశాఖకు సంబంధించిన వివిధ కార్యక్రమాల అమలులో పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యపై ప్రత్యేక దృష్టి సారించి కొత్త ఉపాధ్యాయులను నియమించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోందని కలెక్టర్ తెలిపారు. తాజాగా ప్రారంభించిన అల్పాహార పథకం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం, హాజరు, విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని అన్నారు.

జిల్లాలో ఉపాధ్యాయులు చేస్తున్న మంచి పనికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభిస్తోందని తెలిపారు. ఇటీవల రామగుండం ప్రాంతానికి చెందిన ఒక ఉపాధ్యాయుడు ఫిన్‌లాండ్‌లో శిక్షణా కార్యక్రమానికి ఎంపికయ్యారని, భవిష్యత్తులో మరింత మంది ఉపాధ్యాయులకు విదేశాల్లో శిక్షణ పొందే అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.

పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య ఉచితంగా అందుతున్నందున తల్లిదండ్రులు ఎలాంటి సందేహాలు లేకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు.

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి విద్యార్థుల భవిష్యత్తుకు పటిష్ట పునాది వేయడమే లక్ష్యంగా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీవో సురేష్, మంథని మున్సిపల్ చైర్మన్ వి. శ్రీనివాస్, వైస్ చైర్మన్ సయేందర్ రెడ్డి, మంథని మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకన్న, మంథని మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆర్.జీ.-3 జీఎం, తహసీల్దార్ ఆరిపోద్దిన్, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular