* రేవల్లి ఎస్ఐ పక్షపాత వైఖరిపై మాజీ జడ్పీటీసీ భీమయ్య ఆగ్రహం
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : రేవల్లి పోలీస్ స్టేషన్ ప్రజల కోసం కాకుండా అధికార కాంగ్రెస్ పార్టీ కోసం ఊడిగం చేస్తోందని, స్టేషన్ బోర్డును ‘కాంగ్రెస్ రేవల్లి పోలీస్ స్టేషన్’గా మార్చుకుంటే బాగుంటుందని మాజీ జడ్పీటీసీ భీమయ్య ఘాటుగా విమర్శించారు.
ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య వచ్చిన చిన్నపాటి గొడవలను ప్రెస్ నోట్ ద్వారా బహిర్గతం చేసి ఒక కుటుంబాన్ని పోలీసులు రోడ్డున పడేశారని మండిపడ్డారు. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై నమోదైన తీవ్రమైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు వివరాలను మీడియాకు వెల్లడించకుండా దాచిపెట్టి, సామాన్యుల కుటుంబ సమస్యలను మాత్రం ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు.
ఈ విషయమై వివరణ కోరేందుకు సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ చేస్తే ఎస్ఐ నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పక్షపాతంతో వ్యవహరిస్తున్న రేవల్లి పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

