* ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు
* జిల్లాలో 2 లక్షల 46 వేల 157 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
* సన్న బియ్యం పథకం దుర్వినియోగం కాకుండా చర్యలు
* 116 కులాంతర వివాహ జంటలకు రూ.2.లక్షల 50 వేల చొప్పున ప్రోత్సాహకం పంపిణీ
* స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ విజయ రమణారావు
పెద్దపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందించడంతో పాటు పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణా రావు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లా నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా, అదే సమయంలో అన్ని జిల్లాల్లో పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గతంలో రేషన్ కార్డు పెద్ద పుస్తకం రూపంలో ఉండేదని, ప్రస్తుతం సులభంగా వెంట తీసుకెళ్లే విధంగా స్మార్ట్ రేషన్ కార్డులను రూపొందించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అనేక కుటుంబాలు రేషన్ కార్డులు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు పాత కార్డుల్లో కొత్త లబ్ధిదారులను చేర్చినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 2 లక్షల 46 వేల 157 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నామని, అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రేషన్ షాపుల ద్వారా పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందిస్తున్నామని ప్రభుత్వ విప్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి విక్రయించే పరిస్థితి ఉండేదని, ప్రస్తుతం ప్రజలు నాణ్యమైన సన్నబియ్యాన్ని ఆహారంగా వినియోగిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యం పథకం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించడం సరికాదని, అవసరం లేని వారు రేషన్ బియ్యం తీసుకోకుండా ఉండాలని సూచించారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో అమలు చేస్తున్న ఈ పథకం అర్హులైన పేదలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రేషన్ ద్వారా అందిస్తున్న సన్నబియ్యం మార్కెట్‌లో కిలోకు సుమారు రూ.60 విలువ కలిగిన నాణ్యమైన బియ్యమని, ఈ బియ్యాన్ని మన రైతుల నుంచే ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ను ప్రభుత్వం అందిస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో సుమారు రూ.1,050 కోట్ల మేర బోనస్ చెల్లింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోనే సుమారు రూ.60 కోట్ల బోనస్ రైతులకు అందిందని తెలిపారు. పెద్దపల్లిలో ఉత్పత్తి అవుతున్న సన్నబియ్యం సిరిసిల్ల, మంచిర్యాల తదితర జిల్లాలకు కూడా సరఫరా అవుతోందన్నారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో 30 వేలకు పైగా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశామని, మొత్తం 2 లక్షల 46 వేల 157 కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నామని తెలిపారు. రేషన్ కార్డుల మంజూరు నిరంతర ప్రక్రియ అని, ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉంటే మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డులను టి -రేషన్ యాప్‌కు అనుసంధానం చేయనున్నామని, హోలోగ్రామ్, క్యూ ఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. ప్రజలకు మరింత సులభంగా, పారదర్శకంగా రేషన్ సేవలు అందించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం కులాంతర వివాహాలు చేసుకున్న 116 జంటలకు రూ.2.50 లక్షల చొప్పున ప్రోత్సాహక ఫిక్సిడ్ డిపాజిట్ బాండ్ ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీరాములు, పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీనాథ్, పౌరసరఫరాల మేనేజర్ శ్రీకాంత్,ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్, సంబంధిత అధికారులు,అన్ని మండలాల తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

