Sunday, September 6, 2026

Buy now

పేదల కోసం ‘భూలక్ష్మి’ పథకం: కల్వకుంట్ల కవిత

# ఒక్కో కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్

హైదరాబాద్,బంజారాహిల్స్: రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించాలంటే మరోసారి భూ పంపిణీ జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే “భూలక్ష్మి” పథకం కింద ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు.

సామాజిక న్యాయ సంకల్ప సభ నిర్వహించిన తర్వాతే ముఖ్యమంత్రి సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారని కవిత వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మాటల్లో కాకుండా చేతల్లో సామాజిక న్యాయం చేసి చూపాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గం, నామినేటెడ్ పదవులు, ప్రభుత్వ నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె విమర్శించారు.

గత రెండేళ్లలో భారీగా బడ్జెట్ కేటాయించినప్పటికీ బీసీల కోసం తగిన స్థాయిలో నిధులు ఖర్చు చేయలేదని కవిత ఆరోపించారు. మహిళలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలకు పదవులు, అవకాశాల విషయంలో ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు.

# భూదోపిడీపై తీవ్ర ఆరోపణలు

తెలంగాణలో భూముల విషయంలో పేదలకు అన్యాయం జరుగుతోందని కవిత ఆరోపించారు. పరిశ్రమలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదలు, అసైన్డ్ భూముల యజమానుల నుంచి భూములు తీసుకుంటే సహించబోమని హెచ్చరించారు. పేదల భూముల పరిరక్షణ కోసం తమ పార్టీ పోరాడుతుందని తెలిపారు.

ప్రభుత్వ భూములు, భూదాన్ భూములు, ఇతర అందుబాటులో ఉన్న భూములపై సమగ్ర లెక్కలు నిర్వహించి పేదలకు భూములు పంపిణీ చేసే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. ధరణి, భూభారతి వ్యవస్థల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు.

# “భూలక్ష్మి”తో ఎకరం భూమి:

సామాజిక న్యాయం అంటే ప్రతి కుటుంబానికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడంతో పాటు భూమి హక్కు కూడా ఉండాలని కవిత అన్నారు. ఆదివాసీలు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు భూమి కేవలం ఆస్తి కాదని, వారి గౌరవం, భద్రతకు ఆధారమని పేర్కొన్నారు.

తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ‘భూలక్ష్మి’ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని ఆమె ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడే పేదలకు భూ పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేసిన కవిత, ప్రభుత్వ భూ విధానాలపై ప్రజలు, తెలంగాణ మేధావులు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.

Related Articles

spot_img

Most Popular