Sunday, September 6, 2026

Buy now

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే

సిరిసిల్ల: బాధితుల సమస్యలను పరిష్కరించి వారికి సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 21 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ.. ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేలా పోలీస్ శాఖ పనిచేస్తోందన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి వినతులు, ఫిర్యాదులను స్వీకరించాలని సూచించారు.

అవసరమైన సందర్భాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ఫిర్యాదుదారులకు పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం పెరుగుతుందని అన్నారు.

గ్రీవెన్స్ డేలో స్వీకరించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తూ, వాటి పరిష్కారం ఏ మేరకు జరిగిందనే అంశాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకురావడానికి గ్రీవెన్స్ డే మంచి వేదికగా నిలుస్తోందన్నారు.

ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చినప్పుడు సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం అందించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి. గితే స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular