Sunday, September 6, 2026

Buy now

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే

* గ్రీవెన్స్ డేలో 21 ఫిర్యాదులు స్వీకరణ: జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే
సిరిసిల్ల: బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించి, వారికి చట్టపరంగా న్యాయం అందించడమే లక్ష్యంగా ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 21 ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, బాధితుల సమస్యలను చట్టపరంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడంతో పాటు, ప్రజా సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందన్నారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో అధికారులు, సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు.

వినతులు, ఫిర్యాదులను స్వీకరించి, అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా ఫిర్యాదుదారుల్లో పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం పెరుగుతుందని ఎస్పీ పేర్కొన్నారు.

గ్రీవెన్స్ డేలో స్వీకరించిన ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, వాటి పరిష్కార స్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడమే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు.

ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీస్ అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశాన్ని గ్రీవెన్స్ డే ద్వారా కల్పిస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

Related Articles

spot_img

Most Popular