సిరిసిల్ల: మిలాద్ ఉల్ నబీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో, మతసామరస్యం ఉట్టిపడేలా పండుగను నిర్వహించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి సూచించారు.
సోమవారం సిరిసిల్ల డీఎస్పీ కార్యాలయంలో పట్టణ పరిధిలోని మతపెద్దలతో ఆయన శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రజలంతా పండుగలను మతసామరస్యంతో జరుపుకునేలా ఆయా మతాల పెద్దలు ప్రజల్లో సమన్వయాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు.
పండుగ ఏ మతానికి చెందినదైనా సామరస్యం, సోదరభావం సమాజంలో మంచి సంబంధాలను పెంపొందిస్తాయని తెలిపారు. మిలాద్ ఉల్ నబీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మతపెద్దలు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. ఎవరైనా గొడవలు సృష్టించేలా వ్యవహరిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సిరిసిల్ల టౌన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్‌ఐ గణేష్, మతపెద్దలు పాల్గొన్నారు.

