# పేదలకు ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాలు అందేలా రేషన్ కార్డుల వ్యవస్థలో పారదర్శకత
హైదరాబాద్: రేషన్ కార్డు కేవలం ఒక కాగితం కాదని, పేద కుటుంబాల ఆకలి తీర్చే ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రజా ప్రభుత్వం పేర్కొంది. ప్రతి కుటుంబానికి ఆహార భద్రత కల్పించడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా రేషన్ కార్డుల వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా “స్మార్ట్ రేషన్ కార్డుల” పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడం ద్వారా రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతో పాటు అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
# ప్రతి పేద కుటుంబానికి సన్నబియ్యం
పేదల ఆహార భద్రతకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి పేదవాడి ఇంటికి నాణ్యమైన సన్నబియ్యం అందిస్తూ,ఎవరూ ఆకలితో అలమటించకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
సన్నబియ్యం పంపిణీ ద్వారా పేద కుటుంబాలకు నాణ్యమైన ఆహారం అందించడంతో పాటు వారి ఆరోగ్యానికి, ఆత్మగౌరవానికి భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. ఆహార భద్రతను కేవలం సంక్షేమ పథకంగా కాకుండా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందించాల్సిన ప్రాథమిక బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
# సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు కీలకం
రేషన్ కార్డు ద్వారా కేవలం ఉచిత లేదా సబ్సిడీ ఆహార ధాన్యాలు మాత్రమే కాకుండా అర్హులైన పేద కుటుంబాలకు వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా వ్యవస్థను రూపొందిస్తున్నామని తెలిపారు.
అర్హులైన ప్రతి కుటుంబాన్ని గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలు చేరేలా రేషన్ కార్డుల డేటాను ఆధునికీకరిస్తున్నామని, కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా సేవల పంపిణీ మరింత సులభతరం, పారదర్శకంగా మారుతుందని అధికారులు వివరించారు.
# వికాసం వైపు తెలంగాణ
విధ్వంసానికి గురైన తెలంగాణను వికాసం వైపు నడిపించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఒకవైపు పేదలకు ఆహార భద్రత, సంక్షేమాన్ని అందిస్తూనే మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.
పేదల సంక్షేమం, ఆత్మగౌరవం, ఆహార భద్రతను కాపాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.

