Sunday, September 6, 2026

Buy now

వనపర్తి వద్దు.. నాగర్‌కర్నూల్ ముద్దు!

– 61వ రోజుకు చేరిన ‘తల్పునూర్’ వాసుల రిలే నిరాహార దీక్ష
– స్వాతంత్య్ర దినోత్సవం నాడూ కొనసాగిన నిరసన

ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : దేశవ్యాప్తంగా 80 వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మిన్నంటిన వేళ.. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం ఆ గ్రామ ప్రజలు మాత్రం నిరసన బాటలోనే పయనించారు. తమ గ్రామాన్ని వనపర్తి జిల్లా నుంచి తొలగించి, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో తల్పునూర్ గ్రామస్తులు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారానికి 61వ రోజుకు చేరుకుంది.

స్వాతంత్య్ర దినోత్సవం రోజూ కూడా వీరు దీక్షా శిబిరంలోనే నిరసన తెలియజేశారు. తల్పునూర్ గ్రామం నుంచి వనపర్తి 30 కి.మీ. దూరంలో ఉంది, నాగర్‌కర్నూల్ కేవలం 14-15 కి.మీ. దూరంలోనే ఉందన్నారు. అన్ని అవసరాలకు చేరువలో ఉన్న నాగర్‌కర్నూల్‌పైనే ఆధారపడుతున్నామని గ్రామస్తులు తెలిపారు.

గతంలో తమ గ్రామం నాగర్‌కర్నూల్‌ పరిధిలోనే ఉండేదని, పాలనా సౌలభ్యం కోసం తిరిగి తమ గ్రామాన్ని నాగర్‌కర్నూల్ జిల్లాలోనే విలీనం చేయాలని “వనపర్తి జిల్లా వద్దు.. నాగర్‌కర్నూల్ ముద్దు” అంటూ డిమాండ్ చేస్తున్నారు. గత రెండు నెలలుగా నిరసనలు తెలుపుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్చలు జరిపి, తమ డిమాండ్‌ను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular