Sunday, September 6, 2026

Buy now

వేములవాడ కేజీబీవీలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ

వేములవాడ: వేములవాడ పట్టణంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాన్ని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యాలయంలోని ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.

అనంతరం కిచెన్‌ను సందర్శించిన కలెక్టర్ కూరగాయలు, పండ్లు, కోడిగుడ్లు, పప్పులు, బియ్యం తదితర ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు. వాటి గడువు తేదీలను తనిఖీ చేసి, మెనూ చార్ట్ ప్రకారం ఆ రోజు విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల వివరాలను తెలుసుకున్నారు.

విద్యార్థులు భోజనం చేస్తున్న సమయంలో వారితో కలెక్టర్ మాట్లాడారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందుతున్నదా? ఆహారం ఎలా ఉంటోంది? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సీఈసీ తరగతి గదిని సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వారి భవిష్యత్ ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం తప్పనిసరిగా నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులందరూ క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా పాఠ్యాంశాలను శ్రద్ధగా చదువుకోవాలని, ఇప్పటి నుంచే అన్ని పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను సాధన చేయాలని సూచించారు.

విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో విద్యాభ్యాసం కొనసాగించి, తాము అనుకున్న కొలువుల్లో స్థిరపడటంతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యాలయంలో అందించే పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు.

Related Articles

spot_img

Most Popular