ప్రజానావ ఉమ్మడి మహబూబ్నగర్ బ్యూరో : కేసీఆర్ హయాంలో మహిళలకు ఆర్థిక భరోసా, ఆత్మగౌరవాన్ని అందించిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, వీటిని ఆపే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి మహిళలను మోసం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ కుట్రలపై బి.ఆర్.ఎస్ ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తాలో నిర్వహించిన ‘కదనభేరి’ నిరసన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం హైకోర్టులో కావాలనే కౌంటర్ దాఖలు చేయకుండా అలసత్వం వహిస్తూ, దశలవారీగా పథకాల లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ రద్దుకు దారులు వెతుకుతోందని ఆరోపించారు. రేవంత్ పాలనలో అన్ని వర్గాల సంక్షేమం పడకేసిందని, రైతులకు సాగునీరు అందించడంలోనూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల ప్రకారం రూ. 4వేల ఆసరా పింఛన్, రూ. 2,500 మహిళా భరోసా బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు. బి.ఆర్.ఎస్ నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

