* మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ – INTUC ప్రతినిధి బృందంతో భేటీ**
* డా. బి. జనక్ ప్రసాద్**
హైదరాబాద్: సింగరేణి కార్మికులు, ఉద్యోగుల చిరకాల వాంఛ అయిన సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు INTUC నిరంతరం కృషి చేస్తోందని INTUC సెక్రటరీ జనరల్ డా. బి. జనక్ ప్రసాద్ తెలిపారు. ఇందులో భాగంగా ఆయన ఆధ్వర్యంలోని INTUC ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని హైదరాబాద్‌లో ని ఆయన నివాసంలో కలిసి సింగరేణి కార్మికుల సమస్యలను వివరించింది.
ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై మంత్రితో సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా కార్మికుల చిరకాల వాంఛ అయిన “సొంత ఇంటి పథకం అమలు” ఆవశ్యకత, ప్రాధాన్యతను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని INTUC నాయకులు కోరారు.
INTUC ప్రతినిధి బృందం ప్రస్తావించిన సమస్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ముఖ్యంగా సింగరేణి కార్మికుల “సొంత ఇంటి కల” ను సాకారం చేసే దిశగా వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా డా. బి. జనక్ ప్రసాద్ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కులు, సంక్షేమం, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం INTUC నిరంతరం ప్రభుత్వంతో చర్చలు జరుపుతోందని తెలిపారు. కార్మికులకు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు, వారికి న్యాయం జరిగే వరకు INTUC నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో INTUC సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, కాంపెల్లి సమ్మయ్య, త్యాగరాజన్, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి దాస్ తదితరులు పాల్గొన్నారు.

