Sunday, September 6, 2026

Buy now

హైదరాబాద్ పోలీస్ అధికారులకు రెండు ప్రతిష్ఠాత్మక సేవా పతకాలు

హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ ప్రకటించిన ప్రతిష్ఠాత్మక సేవా పతకాలకు ఎంపికైన హైదరాబాద్ నగర పోలీస్ అధికారులను సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ శుక్రవారం ఘనంగా సత్కరించారు.

రాష్ట్రపతి విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ జే. నర్సయ్య, విశిష్ట సేవా పతకానికి ఎంపికైన సైబర్ క్రైమ్ ఏసీపీ ఆర్.జీ. శివమారుతిని సీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనర్ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో అంకితభావం, అత్యుత్తమ నిబద్ధత ప్రదర్శించినందుకే అధికారులకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో అదనపు డీసీపీ నర్సయ్య, సైబర్ నేరాల నియంత్రణ, సాంకేతిక దర్యాప్తులో ఏసీపీ శివమారుతి కనబరిచిన ప్రతిభ ప్రశంసనీయమన్నారు.

జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక పతకాలు సాధించడం ద్వారా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ కీర్తిప్రతిష్ఠలను మరింత పెంచారని కొనియాడారు. వారి సేవలు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఇదే అంకితభావంతో ప్రజాసేవలో కొనసాగుతూ మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

* అధికారుల విశేష సేవలు

జే. నర్సయ్య, అదనపు డీసీపీ: 1991లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరిన నర్సయ్య 35 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. పలు కీలక కేసుల దర్యాప్తుతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. గతంలో ‘ఇండియన్ పోలీస్ మెడల్’ (ఐపీఎం) సహా పలు పతకాలను అందుకున్నారు.

ఆర్.జీ. శివమారుతి, ఏసీపీ: 1995లో ఎస్సైగా పోలీస్ శాఖలో చేరిన శివమారుతి 31 ఏళ్లుగా సేవలందిస్తున్నారు. ‘ఆపరేషన్ ఆక్టోపస్’ ద్వారా రూ.127 కోట్ల పాన్-ఇండియా సైబర్ మోసాల నెట్‌వర్క్‌ను ఛేదించి గుర్తింపు పొందారు. దర్యాప్తులో ప్రతిభకు గుర్తింపుగా 2022లో ‘కేంద్ర హోంమంత్రి పతకం’ అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు సీపీ ఎం. శ్రీనివాస్, ఐపీఎస్, జాయింట్ సీపీ (ఎస్‌బీ), నార్త్ రేంజ్ శాంతిభద్రతల జాయింట్ సీపీ ఎస్.ఎం. విజయ్‌కుమార్, ఐపీఎస్‌తో పాటు డీసీపీలు కిరణ్ ఖారే, ఐపీఎస్ (చార్మినార్ జోన్), ఎస్. శ్రీనివాస్, ఐపీఎస్ (రాజేంద్రనగర్ జోన్), ఎం. చైతన్య కుమార్, ఐపీఎస్ (డీడీ), లావణ్య నాయక్ జాదవ్ (వుమెన్ సేఫ్టీ వింగ్), డి. రాజేష్ (శంషాబాద్ జోన్), జె. రాఘవేందర్ రెడ్డి (గోల్కొండ జోన్), ఎ. రమణా రెడ్డి (జూబ్లీహిల్స్) తదితర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొని పతక గ్రహీతలకు శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

spot_img

Most Popular