ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని నాగపూర్ గ్రామం నుండి గౌరిదేవిపల్లి వరకు నిర్మిస్తున్న బి.టి రహదారి నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తికాకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2019 ఫిబ్రవరి 27న అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఈ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
శంకుస్థాపన జరిగి ఏడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ రోడ్డు పనులు పూర్తి కాకపోవడం పట్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని బిజెపి వార్డు మెంబర్ వగ్గు పరుశరాములు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన రేవల్లి మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి, రహదారి నిర్మాణంలో జాప్యానికి గల కారణాలు తెలుసుకొని వెంటనే పనులు పూర్తయ్యేలా చూడాలని నాగపూర్, గౌరిదేవిపల్లి గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

