Thursday, July 16, 2026

Buy now

సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ ఎత్తిపోతల పథకం, సీతమ్మసాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టులను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం అధికారులతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించి, మీడియాతో మాట్లాడారు.

గోదావరి నదిలో ప్రవహించే ప్రతి నీటి బొట్టును తెలంగాణ రైతుల కోసం వినియోగించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గోదావరి జలాలను అందుబాటులో ఉన్న అన్ని వ్యవస్థల ద్వారా పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావడానికి ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని చెప్పారు.

వాతావరణ మార్పుల ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఇటీవల దేవాదుల ప్రాజెక్టును సమీక్షించి సమ్మక్క బ్యారేజ్ బ్యాక్‌వాటర్ నుంచి గరిష్ట స్థాయిలో నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టామని, 22 రిజర్వాయర్లను నింపి 12 జిల్లాలు, 17 నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.

సీతారామ ప్రాజెక్టు ఈ ప్రాంత రైతుల కలల ప్రాజెక్టు అని పేర్కొన్న భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. రూ.3,505 కోట్లతో నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టుల్లో రాష్ట్ర విభజనకు ముందే దాదాపు రూ.2,000 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు.

అనంతరం గత ప్రభుత్వం ఈ రెండు ప్రాజెక్టులను రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుగా మార్చడంతో వ్యయం రూ.24 వేల కోట్లకు పెరిగిందని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని అప్పట్లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పటికీ, ప్రస్తుతం ఇప్పటికే పనులు పెద్దఎత్తున పూర్తయినందున ప్రాజెక్టును నిలిపివేయడం ప్రజాహితం కాదని భావించి, పెండింగ్ పనులను పూర్తి చేసి రైతులకు ప్రయోజనం చేకూర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు.

రాజీవ్ కాలువ నిర్మాణం, ఎన్‌ఎస్‌పీ కాలువతో అనుసంధానం, వైరా, పాలేరు రిజర్వాయర్లకు లింక్ కాలువలు, సత్తుపల్లి వరకు సాగునీరు అందేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నిధుల కొరత కారణంగా ఒక్క పని కూడా ఆగదని, అవసరమైన నిధులన్నీ సమకూర్చి సీతారామ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి గోదావరి జలాలను ప్రతి అర్హమైన ఆయకట్టుకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular