రాజన్న సిరిసిల్ల: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను యాక్షన్ ప్లాన్ ప్రకారం వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గురువారం గృహనిర్మాణ శాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతి, వన మహోత్సవం ఏర్పాట్లపై సమీక్షించారు.
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలతో పాటు అన్ని మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ఇప్పటివరకు మంజూరైన ఇళ్లు, నిర్మాణంలో ఉన్నవి, పూర్తయిన గృహాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇండ్లు లేని పేదల కలలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. గుడిసెలు, రేకుల షెడ్లలో నివసిస్తున్న నిజమైన అర్హులకు మాత్రమే ఇళ్లు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
దశలవారీగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి గృహప్రవేశాలు నిర్వహించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఏఈలు ప్రతిరోజూ క్షేత్రస్థాయిలో నిర్మాణాలను పరిశీలిస్తూ లబ్ధిదారులకు అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని, రోజువారీ లక్ష్యాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు.
నిర్మాణాల మంజూరు ప్రక్రియలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించవద్దని స్పష్టం చేసిన కలెక్టర్, రెండో విడతలో నిర్మాణానికి ఆసక్తి ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.
* వన మహోత్సవానికి సన్నద్ధం కావాలి**
వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మొక్కలు అందుబాటులో ఉంచడంతో పాటు ముందుగానే గుంతలు తవ్వి సిద్ధం చేయాలని సంబంధిత శాఖలకు సూచించారు.ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో హౌసింగ్ పీడీ వెంకట మాధవరావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, డీపీఓ జయశీల తదితర అధికారులు పాల్గొన్నారు.

