◆ స్కూల్ విజేతలకు, ప్రతిభావంతులకు నగదు బహుమతుల ప్రధానం
◆ హాజరైన ఐఐటీ, ప్రముఖ సంస్థల పూర్వ విద్యార్థులు
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : వనపర్తి జిల్లా, రేవల్లి మండలం, తల్పునూరు గ్రామంలోని చైతన్య యువజన సంఘం అధ్యక్షులు టీ భాస్కర్ ఆర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్కూల్ హెచ్‌ఎం అలివేలు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల పూర్వ విద్యార్థులు డాక్టర్ జి. ఇంద్రా రెడ్డి, క్వాల్కమ్ సీనియర్ డైరెక్టర్ మహేశ్వర్ సింగ్, మైక్రోసాఫ్ట్ సీనియర్ డైరెక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.
ఈ సందర్భంగా 10వ తరగతిలో విజేతలుగా ఎం. భరత్ కుమార్, కే. పావని, చందనలకు పాత్రికేయులు టి. శేఖర్ మొదటి బహుమతి రూ. 5వేలు, ద్వితీయ బహుమతి రూ. 3వేలు, తృతీయ బహుమతి రూ. 2వేల నగదు బహుమతులు అందజేశారు. అలాగే మాజీ ఐఈఎస్ జి. నవీన్ రెడ్డి తరఫున ప్రతిభావంతులైన విద్యార్థులకు, క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించారు. ఈ వేడుకల్లో సర్పంచ్ జి. పావని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ ఎస్‌డి. ఆలియా, నాయకులు జి. కురుమయ్య, కల్మూరి కిరణ్, మాజీ సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

