Monday, September 7, 2026

Buy now

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత

* ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు
* 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం
* ఆగస్టు 15 నుంచి 2.50 లక్షల మంది అర్హులకు కొత్త సామాజిక భద్రతా పింఛన్లు
* జిల్లాలో 30,909 కొత్త రేషన్‌ కార్డులు.. 88,357 మందికి ప్రయోజనం
* రైతు భరోసా కింద 1,53,582 మంది రైతులకు రూ.161.38 కోట్లు
* 1,40,116 కుటుంబాలకు గృహజ్యోతి ఉచిత విద్యుత్‌, రూ.141.64 కోట్ల సబ్సిడీ
* 5,982 ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రూ.135 కోట్ల ఆర్థిక సహాయం – మరో 5,250 ఇండ్లు మంజూరు
* పెద్దపల్లి ఆర్టీసీ బస్‌ డిపో నిర్మాణానికి రూ.8.40 కోట్లు.. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి
* రూ.82 కోట్లతో నాలుగు వరుసల పెద్దపల్లి బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు
* కోకాకోలా సంస్థ రూ.700 కోట్లకు పైగా పెట్టుబడితో పెద్దపల్లి జిల్లాకు రాక
* స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు

పెద్దపల్లి : స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల స్ఫూర్తితో ప్రజల సంక్షేమం, జిల్లాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం పెద్దపల్లి పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి వేడుకల్లో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం జాతీయ గీతం వందేమాతరం ఆలాపనతో ప్రారంభమైంది. అనంతరం ప్రభుత్వ విప్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పాత్రికేయులకు హృదయపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సుమారు 200 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి 1 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.50 లక్షల మంది అర్హులకు కొత్తగా సామాజిక భద్రతా పింఛన్లు అందించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. మరో 4 లక్షల మంది అదనపు లబ్ధిదారులకు గృహజ్యోతి కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌, మరో 5 లక్షల కుటుంబాలకు మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందించేలా పథకాలను విస్తరిస్తున్నామని తెలిపారు.

*సంక్షేమ పథకాలతో ప్రజలకు ఆర్థిక భరోసా*
జిల్లాలో కొత్తగా 30,909 రేషన్‌ కార్డులు మంజూరు చేసి 88,357 మందికి ప్రయోజనం కల్పించామని ప్రభుత్వ విప్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా తెల్ల రేషన్‌ కార్డుదారులకు నేటి నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. చేయూత పింఛన్ల కింద జిల్లాలో 90,540 మందికి రూ.40.70 కోట్ల పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. మహాలక్ష్మి పథకం కింద రూ.14.03 కోట్ల సబ్సిడీతో 4.74 లక్షల సిలిండర్లను 1.19 లక్షల మంది లబ్ధిదారులకు రూ.500కే అందించామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడం ద్వారా రూ.245.27 కోట్లను ఆదా చేసుకున్నారని చెప్పారు. గృహజ్యోతి పథకం ద్వారా 1,40,116 కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ అందిస్తూ ఇప్పటివరకు రూ.141.64 కోట్ల సబ్సిడీ అందించామని వివరించారు.

*ఇందిరమ్మ ఇండ్లతో పేదల సొంతింటి కల సాకారం*
ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిర్మాణాల పురోగతి ఆధారంగా జిల్లాలో ఇప్పటివరకు 5,982 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.135 కోట్ల ఆర్థిక సహాయం జమ చేశామని ప్రభుత్వ విప్ తెలిపారు. రెండో విడతలో పెద్దపల్లి జిల్లాకు మరో 5,250 ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. జిల్లాలో గుడిసెల్లో నివసిస్తున్న 186 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు.

*రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత*
రైతు సంక్షేమమే ప్రజా ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అని ప్రభుత్వ విప్ స్పష్టం చేశారు. రైతు భరోసా కింద 1,53,582 మంది రైతులకు రూ.161.38 కోట్లు, ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి 23వ విడతలో 65,757 రైతు కుటుంబాలకు రూ.13.15 కోట్లు జమ చేశామని తెలిపారు. వ్యవసాయ రంగానికి 75,257 కనెక్షన్ల ద్వారా 24 గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తూ ఏటా రూ.101 కోట్ల సబ్సిడీ అందిస్తున్నామని తెలిపారు.
రైతులకు మద్దతు ధరతో పాటు సన్నరకం ధాన్యానికి బోనస్‌ అందిస్తూ ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌ 2025–26లో రూ.845.89 కోట్ల విలువైన 3.54 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని, రబీ సీజన్‌లో రూ.1,057 కోట్ల విలువైన 4.46 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని తెలిపారు. ఆయిల్‌పామ్‌ విస్తరణలో భాగంగా ప్రస్తుత సంవత్సరం 571 ఎకరాల్లో పంట విస్తరించామని, మొదటి సంవత్సరం తోటల ఏర్పాటుకు రూ.86.79 లక్షలు, 2, 3, 4వ సంవత్సరాల నిర్వహణకు 2,173 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ పంటకు రూ.91.27 లక్షలు, తెలంగాణ సూక్ష్మ నీటి సేద్య పథకం కింద 567 ఎకరాలకు రూ.1.33 కోట్ల రాయితీ అందించామని వివరించారు.

*విద్యారంగంలో పెద్దపల్లి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం*
అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా మౌలిక వసతుల కోసం సుమారు రూ.22 కోట్లు, భవిత కేంద్రాల అభివృద్ధికి రూ.66 లక్షలు, కస్తూర్బా విద్యాలయాల అభివృద్ధికి రూ.1.69 కోట్లు, ప్రీ-ప్రైమరీ విద్య బలోపేతానికి రూ.98.60 లక్షలు వినియోగించామని ప్రభుత్వ విప్ తెలిపారు. పునాది అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్య సర్వేలో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచి, నాణ్యమైన బోధన, మెరుగైన అభ్యాస ఫలితాలు, డిజిటల్‌ విద్యలో పెద్దపల్లి జిల్లాను ఆదర్శంగా నిలుపుతున్నామని చెప్పారు.

*మహిళా సాధికారతకు పెద్దపీట*
జిల్లాలో బ్యాంకు లింకేజీ ద్వారా 2,013 సంఘాలకు రూ.142.76 కోట్ల రుణాలు, స్త్రీనిధి ద్వారా 1,316 మంది సభ్యులకు రూ.12.80 కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు.ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాల ద్వారా రూ.5.40 కోట్లతో 15 బస్సులు కొనుగోలు చేశామని చెప్పారు. రంగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన మహిళా వ్యాపార నైపుణ్య కేంద్రం ద్వారా 703 మందికి శిక్షణ ఇచ్చామని తెలిపారు.

*ఉపాధి హామీ, జల సంరక్షణకు ప్రాధాన్యత*
2026–27లో ఉపాధి హామీ పథకం ద్వారా 48,530 కుటుంబాలకు 14.72 లక్షల పనిదినాలు కల్పించి రూ.56.95 కోట్లు ఖర్చు చేశామని ప్రభుత్వ విప్ తెలిపారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన వికసిత్‌ భారత్‌ గ్రామీణ్‌ గ్యారెంటీ రోజ్‌గార్‌ మరియు అజీవిక మిషన్‌ కింద ఇప్పటివరకు 90,804 పనిదినాలు కల్పించి రూ.2.61 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు తెలంగాణ జలసిరి కింద ఫార్మ్‌ పాండ్లు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ గుంతలు, ఇంకుడు గుంతలు, ఊటకుంటల నిర్మాణానికి చర్యలు చేపట్టామని తెలిపారు.

*వైద్య రంగంలో ఆధునిక మౌలిక వసతులు*
ఆరోగ్యశ్రీ ద్వారా 48,188 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించి రూ.120.56 కోట్ల మేర లబ్ధి చేకూర్చామని ప్రభుత్వ విప్ తెలిపారు.రూ.101.45 కోట్ల అంచనా వ్యయంతో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని 50 నుంచి 100 పడకలకు విస్తరించడం, మంథనిలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, గుంజపడుగులో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, రామగుండంలో ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

*మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట*
గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ హ్యామ్‌ మొదటి దశలో సుమారు 141 కిలోమీటర్ల మేర 44 రహదారి పనులు చేపడుతోందని తెలిపారు.
ప్లాన్‌ గ్రాంట్ల కింద 21 రహదారి పనులకు రూ.574 కోట్లతో 125 కిలోమీటర్లు, డీఎంఎఫ్‌టీ నిధులతో 19 రహదారి పనులకు రూ.187 కోట్లతో 43.08 కిలోమీటర్ల మేర అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.10 వంతెనల నిర్మాణం, విస్తరణకు రూ.482 కోట్లతో పనులు చేపట్టి 6 పూర్తి చేశామని, 56 రహదారి పనులకు రూ.141 కోట్లతో అభివృద్ధి, మరమ్మతులు చేపట్టి 41 పనులు పూర్తి చేశామని వివరించారు. పెద్దపల్లి –కాల్వ శ్రీరాంపూర్‌ –కూనారం రోడ్డులో రూ.119 కోట్లతో చేపట్టిన ఆర్‌ఓబీ పనులు 75 శాతం పూర్తయ్యాయని తెలిపారు.భవనాల విభాగంలో గోదావరిఖని, పెద్దపల్లి కోర్టు భవనాలకు రూ.104.81 కోట్లు, రామగుండం ఆసుపత్రికి రూ.160 కోట్లతో పనులు చేపట్టామని, ఆసుపత్రి భవనం పూర్తయ్యే దశలో ఉందని చెప్పారు. మంథనిలో ఎన్‌ఏసీ భవనానికి రూ.20 కోట్లు, విశ్రాంతి భవనానికి రూ.4.50 కోట్లు మంజూరు చేసి పనులు కొనసాగిస్తున్నామని తెలిపారు. అమృత్‌ 2.0 కింద రూ.311 కోట్లు, యూఐడీఎఫ్‌ కింద రూ.201 కోట్లు, డీఎంఎఫ్‌టీ నిధుల ద్వారా రూ.88 కోట్లతో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, వీధి దీపాలు తదితర అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు.ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా 35,065 మంది వీధి వ్యాపారులకు రూ.69.54 కోట్ల రుణాలు అందించామని చెప్పారు. మహిళా సంఘాలకు రూ.4.08 కోట్ల వడ్డీ మాఫీ చేశామని తెలిపారు.

*పెద్దపల్లి ప్రజల చిరకాల స్వప్నాలు సాకారం*
పెద్దపల్లి ప్రజల దశాబ్దాల కల అయిన ఆర్టీసీ బస్‌ డిపోను ప్రజా ప్రభుత్వం సాకారం చేస్తోందని ప్రభుత్వ విప్ అన్నారు. బస్‌ డిపో నిర్మాణానికి ఆర్టీసీ రూ.8.40 కోట్లు మంజూరు చేసిందని, పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలోనే నిర్మాణాన్ని పూర్తి చేసి పెద్దపల్లి ప్రజలకు బస్‌ డిపోను అందుబాటులోకి తీసుకురానున్నామని చెప్పారు. పెద్దపల్లి ప్రజల చిరకాల కోరిక అయిన బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్‌ రెడ్డి రూ.82 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. నాలుగు వరుసలుగా, సెంట్రల్‌ లైటింగ్‌తో నిర్మించనున్న ఈ బైపాస్‌ రోడ్డు పట్టణ ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించనుందని చెప్పారు.

*పెద్దపల్లి పారిశ్రామిక ప్రగతికి కొత్త ఊతం*
జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తూ టీజీఐపాస్‌ ద్వారా 31 యూనిట్లకు అనుమతులు మంజూరు చేసి రూ.17.75 కోట్ల పెట్టుబడులతో 346 ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం చేశామని తెలిపారు. టీ ఐడియా, టీ ప్రైడ్‌ పథకాల కింద 24 పరిశ్రమలకు రూ.4.49 కోట్ల సబ్సిడీ, ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 29 యూనిట్లకు రూ.1.19 కోట్ల సబ్సిడీ అందించామని చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు మంథని మండలంలో రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ప్లగ్‌ అండ్‌ ప్లే గార్మెంటింగ్‌ యూనిట్ల కోసం కేటాయించామని తెలిపారు. డిజిటల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ద్వారా జాబ్‌ మేళా నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పించామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కృషితో కోకాకోలా సంస్థ రూ.700 కోట్లకు పైగా పెట్టుబడితో పెద్దపల్లి జిల్లాకు వస్తోందని ప్రభుత్వ విప్ తెలిపారు. రామగిరి మండలం రత్నాపూర్‌ గ్రామంలో పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించామని, ఈ పరిశ్రమతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి ఇది కీలకంగా మారనుందని అన్నారు.

*జాతీయ స్థాయి అవార్డు గ్రహీతకు ఘన సన్మానం*
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయ స్థాయిలో సంగీత నాటక అవార్డు అందుకున్న దురిశెట్టి రామయ్యను ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ఘనంగా సన్మానించారు. కళారంగంలో ఆయన అందిస్తున్న సేవలను అభినందించారు. మంథని ప్రాంతంలో వరదల సమయంలో ప్రజలను రక్షించడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన అంతం శేఖర్‌, ఆకుల అరవింద్‌లను కూడా ప్రభుత్వ విప్ సన్మానించి అభినందించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు వారు చూపిన ధైర్యం, సేవా స్ఫూర్తి ఆదర్శనీయమని అన్నారు.

*తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పతకాలు అందుకున్న 12 మంది*
విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర పోలీస్ సేవా పతకాలు లభించాయి.

*ఉత్తమ సేవా పతకం:*
ఎం. రవీందర్, ఎస్‌ఐ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌, రామగుండం, టి. తిరుపతి, ఏఎస్‌ఐ ఎన్‌టీపీసీ పోలీస్‌ స్టేషన్‌,
కె. శ్రీనివాస్ ఏఎస్‌ఐ రామగుండం పోలీస్‌ స్టేషన్‌

*సేవా పతకం:*
కె. ప్రవీణ్‌ కుమార్‌, సీఐ పెద్దపల్లి, ఎం.డి. అబ్దుల్‌ జలీల్‌, ఏఎస్‌ఐ ధర్మారం పోలీస్‌ స్టేషన్‌, బి. రామచంద్రయ్య, ఏఎస్‌ఐ జూలపల్లి పోలీస్‌ స్టేషన్‌, యు. మల్లయ్య ఏఎస్‌ఐ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌, రామగుండం, బి. బుచ్చన్‌ నాయుడు ఏఎస్‌ఐ ఎన్‌టీపీసీ పోలీస్‌ స్టేషన్‌, పి. కుమారస్వామి ఏఆర్‌ఎస్‌ఐ సీఏఆర్‌, రామగుండం, ఎన్. శ్రీనివాస్‌ హెచ్‌సీ సీఎస్‌బీ, రామగుండం, జె. రమేష్‌ హెచ్‌సీ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌, రామగుండం, జి. రామలింగారెడ్డి ఏఆర్‌పీసీ సీఏఆర్‌, రామగుండం, ఈ సందర్భంగా సేవా పతక గ్రహీతలను ప్రభుత్వ విప్ అభినందించారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని అన్నారు.

*ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు*
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విద్యార్థులు నిర్వహించిన దేశభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ధర్మారం కేజీబీవీ విద్యార్థులు “హే శుభ్ ఆరంభ్” పాటకు, జూలపల్లి కేజీబీవీ విద్యార్థులు “తిరంగా”, “ఎత్తర జెండా” పాటలకు ప్రదర్శనలు ఇచ్చారు. ఎంజేపీ విద్యార్థులు పాడుదామా స్వేచ్ఛా గీతం కు అందించిన ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.విద్యార్థుల ప్రతిభను ప్రభుత్వ విప్ ప్రత్యేకంగా అభినందించారు.

*244 మంది ఉద్యోగులకు ప్రశంసలు*
జిల్లాలో విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించిన వివిధ శాఖలకు చెందిన 244 మంది ఉద్యోగులను ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు ప్రశంసించి అభినందించారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సేవలను గుర్తించి ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.శ్రీరాములు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణ శ్రీ, డిసిపి రాంరెడ్డి, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆర్డీఓ బి. గంగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, కలెక్టరేట్ ఏఓ ప్రకాష్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular