Sunday, September 6, 2026

Buy now

గద్వాల పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు – జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఏపీ జితేందర్ రెడ్డి

గద్వాల: అభివృద్ధి, సంక్షేమమే ప్రధానంగా సుపరిపాలన అందిస్తూ జోగులాంబ గద్వాల జిల్లా సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఏపీ జితేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రైజింగ్–2047 లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గద్వాల పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన ఓపెన్ టాప్ జీపులో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన జితేందర్ రెడ్డి, ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో పరిశుభ్రత, ఆరోగ్యం, రైతు సంక్షేమం, విద్య, ఉపాధి, మహిళా శిశు సంక్షేమం, యువత మరియు క్రీడలకు ప్రోత్సాహం వంటి పలు అంశాలపై విస్తృత కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

# ఆరు గ్యారంటీల అమలులో ముందంజ

మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.21 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా, రూ.123.78 కోట్ల ప్రయోజనం చేకూరిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య పరిమితిని రూ.10 లక్షలకు పెంచి, జిల్లాలో 16,686 మందికి వైద్య సేవలు అందించినట్లు వెల్లడించారు.

రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ జిల్లాలో 58,113 మంది రైతులకు రూ.513.99 కోట్ల పంట రుణమాఫీ చేసినట్లు తెలిపారు. రైతు భరోసా పథకం కింద ఎకరానికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఈ వానాకాలంలో 1.72 లక్షల మంది రైతులకు రూ.263 కోట్లను నేరుగా ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు.

# సంక్షేమ పథకాల అమలులో విశేష పురోగతి

జిల్లాలో 6.76 లక్షల మందికి ఉచిత రేషన్ బియ్యం పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 6,795 ఇళ్లకు మంజూరు ఇవ్వగా, 649 ఇళ్లు పూర్తయ్యాయని చెప్పారు. రూ.500 గ్యాస్ పథకం ద్వారా 95,752 మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరిందని, గృహజ్యోతి పథకం కింద 88,190 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు వివరించారు.

చేయూత పెన్షన్ పథకం కింద ప్రతి నెల 66,548 మంది లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నామని, స్వయం సహాయక సంఘాలకు భారీ స్థాయిలో బ్యాంకు రుణాలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

# గూడెందొడ్డి రిజర్వాయర్ విస్తరణకు క్యాబినెట్ ఆమోదం

జిల్లా అభివృద్ధిలో భాగంగా నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో నిర్మించిన గూడెందొడ్డి రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని జితేందర్ రెడ్డి వెల్లడించారు. అలాగే గట్టు ఎత్తిపోతల ప్రాజెక్టు సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు పెంచే రీడిజైన్ పనులకు రూ.1,781 కోట్లతో ఆమోదం లభించిందన్నారు.

మల్లమ్మకుంట రిజర్వాయర్ పనులను వేగవంతం చేస్తున్నామని, జిల్లాలో విద్యుత్ సబ్‌స్టేషన్లు, రహదారులు, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, క్రిటికల్ కేర్ యూనిట్ భవనాలు, నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు.

# విద్య, పరిపాలనలోనూ పురోగతి

జిల్లాలో ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని, అదనంగా 120 మంది విద్యా వాలంటీర్లను నియమించినట్లు తెలిపారు. ఓటరు జాబితా డిజిటలైజేషన్‌లో జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని, జనాభా గణనకు సంబంధించిన ఇండ్ల లెక్కింపు విజయవంతంగా పూర్తయిందన్నారు.

జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అలాగే 617 మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించిన రూ.69 కోట్ల విలువైన చెక్కులను అతిథులు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో గద్వాల, ఆలంపూర్ ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ చైర్‌పర్సన్, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

spot_img

Most Popular