Sunday, September 6, 2026

Buy now

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వం కీలక ప్రకటన

హైదరాబాద్: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలుపై తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకాలను కొనసాగించాలనే ఉద్దేశంతోనే నిధులను గ్రీన్‌చానెల్ ద్వారా విడుదల చేస్తున్నామని తెలిపింది. అయితే పథకాల అమలుకు సంబంధించిన కొన్ని జీవోలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ నేపథ్యంలో మధ్యంతర ఉత్తర్వులు వెలువడినట్లు పేర్కొంది.

కళ్యాణలక్ష్మి పథకానికి సంబంధించి ఇప్పటివరకు జారీ చేసిన ఎనిమిది జీవోలను సవాల్ చేస్తూ W.P. No.21732/2026లో పిటిషన్ దాఖలైందని ప్రభుత్వం తెలిపింది. ఈ పిటిషన్‌పై ఆగస్టు 12న హైకోర్టు సెప్టెంబర్ 9 వరకు మధ్యంతర స్టే విధించిందని పేర్కొంది. కోర్టు ఆదేశాలను గౌరవిస్తూనే, స్టేను తొలగించేందుకు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయిస్తున్నామని, సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నామని వెల్లడించింది.

* గత ప్రభుత్వ జీవోల వల్లే ప్రస్తుత పరిస్థితి

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలలో ప్రస్తుతం తలెత్తిన న్యాయపరమైన సమస్యలకు 2014లో గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులే కారణమని ప్రభుత్వం ఆరోపించింది. అప్పట్లో జీవోలు సరైన రీతిలో రూపొందించి ఉంటే ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదని పేర్కొంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో లోపాలు ఉంటే వాటిని సరిచేసి పథకాలను కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో అధికారుల స్థాయిలో లేదా ప్రభుత్వ న్యాయపరమైన వ్యవహారాలను పర్యవేక్షించే విభాగంలో ఏదైనా లోపం జరిగిందా అనే అంశంపై విచారణ జరుపుతున్నామని ప్రభుత్వం తెలిపింది. బాధ్యులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

*రూ.16,375 కోట్లకు పైగా నిధులు

ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు 16,78,347 మంది లబ్ధిదారులకు ప్రయోజనం అందింది. ఇందుకోసం మొత్తం రూ.16,375.87 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపింది.

* ఎస్సీ సంక్షేమం: రూ.2,734.81 కోట్లు – 2,73,164 మంది లబ్ధిదారులు
* ఎస్టీ సంక్షేమం: రూ.1,801.48 కోట్లు – 1,79,939 మంది
* బీసీ సంక్షేమం: రూ.7,803.05 కోట్లు – 7,79,401 మంది
* ఈబీసీ సంక్షేమం: రూ.831.70 కోట్లు – 83,074 మంది
* మైనారిటీ సంక్షేమం: రూ.3,204.83 కోట్లు – 3,62,769 మంది

*రాజ్యాంగబద్ధంగానే పథకాల అమలు

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఏదైనా ప్రత్యేక చట్టాన్ని అమలు చేయడానికి రూపొందించినవి కావని ప్రభుత్వం తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 162 కింద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న కార్యనిర్వాహక అధికారంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలని పేర్కొంది. రాష్ట్ర బడ్జెట్‌కు శాసనసభ ఆమోదం ఉంటుందని, ట్రెజరీ రూల్స్, ఫైనాన్షియల్ కోడ్, ఇతర ఆర్థిక నిబంధనలకు అనుగుణంగానే నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేసింది.

లబ్ధిదారుల అర్హత, ఆదాయ పరిమితి, వయస్సు, ఆధార్, వివాహం తదితర అంశాలకు సంబంధించి నిర్దిష్ట నిబంధనలు ఉన్నాయని తెలిపింది. వివాహ సమయానికి వధువుకు 18 సంవత్సరాలు పూర్తై ఉండటం తప్పనిసరి అని పేర్కొంది. ఆర్డీవో, ఎమ్మార్వో స్థాయిలో లబ్ధిదారుల అర్హతను పరిశీలించే వెరిఫికేషన్ వ్యవస్థ ఉందని వెల్లడించింది.

*పేద కుటుంబాలకు అండగా పథకాలు

పేద కుటుంబాల్లో ఆడబిడ్డ వివాహ సమయంలో పడే ఆర్థిక భారాన్ని తగ్గించడమే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. వివాహాన్ని కేవలం వ్యక్తిగత కార్యక్రమంగా చూడకుండా పేద కుటుంబాలకు సామాజిక, ఆర్థిక బాధ్యతగా పరిగణిస్తున్నామని పేర్కొంది.

ఈ పథకాలు సామాజిక న్యాయం, బలహీన వర్గాల సంక్షేమం అనే రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నాయని, ఆర్టికల్ 46 కూడా బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాల అభివృద్ధికి రాష్ట్రం కృషి చేయాలని సూచిస్తోందని ప్రభుత్వం వివరించింది.

*రాజకీయాలకు అతీతంగా కొనసాగిస్తాం

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను గత ప్రభుత్వం ప్రారంభించినప్పటికీ, రాజకీయాలకు అతీతంగా పేదల ప్రయోజనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని ప్రభుత్వం పేర్కొంది. 2014లో ప్రారంభమైన ఈ పథకాలను అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకు కూడా విస్తరించినట్లు తెలిపింది.

గతంలో లబ్ధిదారులకు నిధులు అందడంలో జాప్యం జరిగేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోడల్ ఏజెన్సీ ద్వారా గ్రీన్‌చానెల్‌లో నిధులు విడుదల చేసే విధానాన్ని ఏర్పాటు చేశామని పేర్కొంది. పేదల ప్రయోజనానికి సంబంధించిన ఈ పథకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయబోమని స్పష్టం చేసింది.

* బీఆర్‌ఎస్‌ నిరసనలపై విమర్శలు

కళ్యాణలక్ష్మి పథకంపై బీఆర్‌ఎస్‌ నిరసనలు చేయడాన్ని ప్రభుత్వం విమర్శించింది. పథకాన్ని నిలిపివేయాలనే ఉద్దేశం తమకు లేదని, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని తామే కొనసాగిస్తున్నామని స్పష్టం చేసింది. పథకానికి సంబంధించి ప్రస్తుత న్యాయపరమైన పరిస్థితికి గతంలో జారీ చేసిన జీవోలే కారణమని ఆరోపించింది.

ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాన్ని రాజకీయంగా మార్చడం సరికాదని, ప్రభుత్వం పథకాలను కొనసాగించేందుకు న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగిస్తుందని తెలిపింది.

* సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

ఇదిలా ఉండగా, బహుజన నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా మంగళవారం ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, బలహీన వర్గాల నాయకులు, కుల సంఘాల నాయకులు పాల్గొననున్నట్లు వెల్లడించింది.

ఇటీవలే ట్యాంక్‌బండ్‌ సమీపంలో సామాజిక ఉద్యమ నాయకులు మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే విగ్రహాలను ఆవిష్కరించినట్లు ప్రభుత్వం పేర్కొంది.

Related Articles

spot_img

Most Popular