ఎల్లారెడ్డి: నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. నియోజకవర్గంలోని వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయడంతో పాటు, విద్యుత్ సమస్యల పరిష్కారానికి 13 నూతన విద్యుత్ సబ్‌స్టేషన్లు మంజూరు చేయాలని కోరుతూ ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే మదన్ మోహన్ వినతిపత్రం అందజేశారు.
నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నెలకొన్న తక్కువ వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు, భవిష్యత్‌లో పెరగనున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని 13 నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. అలాగే వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను త్వరితగతిన విడుదల చేయాలని కోరారు.
* ప్రతిపాదిత సబ్‌స్టేషన్ల ప్రాంతాలు:
1. గోలి లింగాల గేట్ – నాగిరెడ్డిపేట్ మండలం
2. గిద్ద – రామారెడ్డి మండలం
3. వెల్లుట్ల – ఎల్లారెడ్డి మండలం
4. సోమార్పేట్ – ఎల్లారెడ్డి మండలం
5. దుర్గం – గాంధారి మండలం
6. గౌరారం (కలాన్) – గాంధారి మండలం
7. గుర్జాల్ – గాంధారి మండలం
8. ధర్మారావుపేట్ – సదాశివనగర్ మండలం
9. కుప్రియాల్ – సదాశివనగర్ మండలం
10. తిమ్మోజీవాడి – సదాశివనగర్ మండలం
11. లింగంపల్లి – సదాశివనగర్ మండలం
12. మెంగారం – లింగంపేట్ మండలం
13. లింగంపల్లి ఖుర్ద్ – లింగంపేట్ మండలం
ఎమ్మెల్యే మదన్ మోహన్ అందించిన వినతిపత్రంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. పెండింగ్ బిల్లుల విడుదలతో పాటు 13 నూతన సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి, త్వరలోనే అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
నియోజకవర్గ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు సాధించేందుకు ఎమ్మెల్యే మదన్ మోహన్ చేస్తున్న నిరంతర కృషిపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

