* ఏదులలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన, దిష్టిబొమ్మ దహనం
ప్రజానావ ఉమ్మడి మహబూబ్ నగర్ బ్యూరో : కేసీఆర్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా వంటి ఆదర్శవంతమైన పథకాలను ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని బీఆర్‌ఎస్ నాయకులు మండిపడ్డారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం ఏదుల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టి, ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచులు దొడ్ల రాముడు, రమేష్ యాదవ్, మాజీ ఎంపీటీసీ రాజూరెడ్డి, నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పక్కనబెట్టి ఉన్న పథకాలకు ఎసరు పెడుతున్నారని విమర్శించారు. రైతుబీమా ప్రీమియంను ప్రభుత్వం సరైన సమయానికి చెల్లించకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అసత్య ప్రచారాలు మాని, ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు అబ్దుల్ మహమూద్, విజయ్‌మోహన్, ప్రవీణ్ రెడ్డి, కృపాకర్ రెడ్డి, ఆంజనేయులు, బిచ్చిరెడ్డి, సత్తార్, బంకల జాన్, దవడ రాములు, శేషిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

