Sunday, September 6, 2026

Buy now

22A నిషేధిత భూముల జాబితాను వెంటనే రద్దు చేయాలి: బీఆర్‌ఎస్ నేతల డిమాండ్

మల్కాజ్‌గిరి: 22A నిషేధిత భూముల జాబితాలో చేర్చిన భూములను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ మల్కాజ్‌గిరిలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొని ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం కొత్త సమస్యలను సృష్టిస్తోందని ఆరోపించారు. రాత్రికి రాత్రే కాలనీలకు కాలనీలను 22A నిషేధిత జాబితాలో చేర్చడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులకు ప్రజలు అధికారుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఎందుకు రావాలని ప్రశ్నించారు.

2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణ భూ పరిమితి (ULC) చట్టాన్ని రద్దు చేసిన తర్వాత అనేక భూములు పట్టా భూములుగా మారాయని, ఏళ్లుగా ప్రజలు వాటిలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. దాదాపు రెండు దశాబ్దాలుగా లేని సమస్యను ఇప్పుడు ఎందుకు సృష్టించారని ప్రశ్నించారు.

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మినహాయింపు పొందిన భూములు, HMDA, HUDA పరిధిలోని భూములను సైతం నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. భూమిని విక్రయించేందుకు వెళ్లే వరకు తమ ఆస్తి 22A జాబితాలో ఉందనే విషయం కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. లక్షలాది స్థలాలు, ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు.

తిలక్‌నగర్‌కు చెందిన అశోక్ అనే వ్యక్తి తన 450 గజాల ఇంటిని విక్రయించేందుకు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లినప్పుడు అది నిషేధిత జాబితాలో ఉన్నట్లు తెలిసిందని నాయకులు తెలిపారు. ఇలాంటి సమస్యలను జర్నలిస్టులు, సామాన్య ప్రజలు ఎంతోమంది ఎదుర్కొంటున్నారని అన్నారు.

# రెవెన్యూ మంత్రి రాజీనామాకు డిమాండ్

22A నిషేధిత భూముల వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. నిషేధిత జాబితాలో భూములను చేర్చింది ప్రభుత్వమే కాబట్టి వాటిని తొలగించే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనన్నారు.

ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని వారిని కార్యాలయాల చుట్టూ తిప్పకుండా, తప్పుగా చేర్చిన భూములను స్వయంగా గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ సక్రమంగా పనిచేయడం లేదని ఆరోపించారు.

22A జాబితాలో చేర్చిన భూముల వివరాలు, తొలగించిన భూముల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని, ప్రభుత్వం ఈ వ్యవహారంపై వైట్‌పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా చోటుచేసుకున్న వ్యవహారానికి బాధ్యత వహిస్తూ సంబంధిత మంత్రిపై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని కోరారు.

# అసెంబ్లీలో పోరాటం చేస్తాం

22A నిషేధిత భూముల సమస్యపై అసెంబ్లీ వేదికగా బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని నాయకులు ప్రకటించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా తెలంగాణ భవన్‌ తలుపులు తెరిచే ఉంటాయని, బాధితులు తమ సమస్యలను తీసుకురావాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల హక్కుల కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత బలంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.

Related Articles

spot_img

Most Popular